ఇంకెన్నాళ్లు!

ABN , First Publish Date - 2020-03-13T10:21:36+05:30 IST

ఇంకెన్నాళ్లు!

ఇంకెన్నాళ్లు!

గొర్రెల కోసం ఎదురుచూస్తున్న గొల్ల,కురుమలు

మొదటి విడతలో 11,312 యూనిట్ల పంపిణీ

రెండో విడతకు 21,037 మంది అర్హులు

జిల్లాలో 368 సొసైటీలు, 41,964 మంది సభ్యులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రెండో విడత గొర్రెల పంపిణీ జరగలేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో లబ్ధిదారులు ఈ యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. రెండో విడత పంపిణీ చేసే గొర్రెల కోసం డీడీలు కట్టేందుకు లబ్ధిదారులు పశుసంవర్ధశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్వీకరించడం లేదు. జిల్లావ్యాప్తంగా 368 గొర్రెల పెంపకందారుల సంఘాలు ఉండగా, అందులో 18 సంవత్సరాలు నిండిన 41,964 మంది గొల్ల, కురుమలు సభ్యత్వాన్ని తీసుకున్నారు. అయితే విడతల వారీగా అరులైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మొదటి విడతలో ఈ పథకం కింద ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో రూ.125 కోట్ల విలువగల గొర్రెలు,పొట్టేలుతో కలిపి 21 గొర్రెల చొప్పున జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 36 వేల గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడత గొర్రెల పంపిణీ చేయాల్సి ఉండగా.. మొదటి విడతలో చనిపోయిన గొర్రెలకు బదులుగా గొర్రెలు పంపిణీ చేశారు. జిల్లాలో 2,956 చనిపోగా వాటిస్థానంలో ఇప్పటివరకు 2,709 గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గొర్రెల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. 


రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు గొల్ల, కురుమలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పురోగతి కనిపించడం లేదు. మొదటి విడతలో (2017-18) ఆర్థిక సంవత్సరంలో 20,927 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 11,312 యూనిట్లను 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేసింది. దీనికోసం రూ.125 కోట్లు ఖర్చు చేసింది. మొదటి విడత పంపిణీ చేసి ఏడాది పూర్తయినా రెండో విడత పంపిణీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాగా జిల్లాలోని 368 సొసైటీల్లో మిగిలిపోయిన లబ్ధిదారులు రెండో విడత పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొందరికేనా అని గొర్రెల పంపిణీ పథకంపై గొర్రెలు అందుకోని లబ్ధిదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పశుసంవర్ధకశాఖ కు సరిపడా నిధులు కేటాయించక పోవడంతోనే గొర్రెల పంపిణీకి బ్రేక్‌ పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలిస్తే.. మొదటి విడత స్ఫూర్తితోనే రెండోవిడత గొర్రెల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. గతేడాది ప్రారంభం నుంచి మొన్నటి వరకు ఏదో ఒక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రెండో విడత పంపిణీకి బ్రేక్‌ పడిందంటూ జిల్లాలో ఆరోపణలు వినిపించాయి. 


75 శాతం రాయితీపై..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొర్రెలను అందిస్తోంది. ఒక్కో యూనిట్‌పై 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటుంది. స్థానికంగా లభించే జీవాలు కాకుండా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచి గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక యూనిట్‌ విలువ రూ. 1.25 లక్షలు కాగా అందులో ప్రభుత్వం యూనిట్‌కు 75 శాతం (రూ.93,750) రాయితీ ఇస్తుండగా.. మిగతా 25 శాతం (రూ. 31,250) లబ్ధిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గొర్రెల కొనుగోలుతోపాటు రవాణా చార్జీలు, బీమాకు అయ్యే ఖర్చులు ఇందులోనే ఉంటాయి. అయితే ఒక గొర్రె రూ.5,200, పొట్టేలుకు రూ.7,200లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 


రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు

జిల్లాలో గొర్రెలను పెంచేందుకు ఆసక్తిగల గొల్ల, కురుమ కుటుంబాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మొదటి విడతలోపూ దరఖాస్తులు స్వీకరించారు. వారికి నూతన సంఘాలను రిజిస్ర్టేషన్‌ చేయించారు. అన్ని మండలాల్లో గ్రామ సభలు జరిపి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ విడతల వారీగా గొర్రెల పంపిణీ చేయనున్నారు. తొలివిడత పంపిణీలో ఇంకా మిగిలిపోయిన వారంతా గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2020-03-13T10:21:36+05:30 IST