దుమ్ములేస్తోంది!

ABN , First Publish Date - 2020-12-12T05:05:11+05:30 IST

దుమ్ములేస్తోంది!

దుమ్ములేస్తోంది!
టిప్పర్‌ వెనుక ఎగసిన దుమ్ము

  • అధ్వానంగా సంగెం-వేముల్‌నర్వ రోడ్డు 
  • ఓవర్‌లోడ్‌తో నిత్యం టిప్పర్ల రాకపోకలు 
  • బీటీ దెబ్బతిని కంకర తేలిన వైనం
  • దుమ్ము, ధూళితో వాహనదారుల అవస్థలు 
  • పట్టించుకోని అధికారులు

కేశంపేట: మండల పరిధిలోని సంగెం-వేముల్‌నర్వ రహదారి ప్రమాదభరితంగా మారింది. సంగెం నుంచి వేముల్‌నర్వ వరకు దాదాపు 5 కిలోమీటర్లు గతంలో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. అయితే సంగెం, పుట్టోనిగూడ, వేముల్‌నర్వ, దత్త్తాయపల్లి గ్రామాల శివారుల్లో మైనింగ్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఈ మైనింగ్‌ ప్రాంతాల నుంచి కంకర, డస్ట్‌ టిప్పర్లు ఓవర్‌ లోడుతో వెళ్తుంటాయి. దీని కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతోంది. అంతేకాకుండా బీటీ లేచిపోయి కంకర తేలి రోడ్డుగా అధ్వానంగా మారింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లతో రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్న సమయంలో దట్టమైన దుమ్ము, ధూళి ఎగసి ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోడ్డు ధ్వంసమైన కారణంగా హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రూటు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సంగెం-వేముల్‌నర్వ పరిసర గ్రామాల ప్రజలు, రైతులు శంషాబాద్‌, హైదరాబాద్‌ వెళ్లడానికి అవస్థలకు గురవుతున్నారు. ప్రధానంగా రైతులు పండించిన కూరగాయలు శంషాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తుంటారు. రోడ్డు బాగులేని కారణం గా కూరగాయలు తరలించడానికి రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా ఈ మా ర్గంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-12-12T05:05:11+05:30 IST