ఆలస్యమైనా రోడ్డు విస్తరణ ఆగదు
ABN , First Publish Date - 2020-12-14T04:43:20+05:30 IST
ఆలస్యమైనా రోడ్డు విస్తరణ ఆగదు

- నాలుగు లేన్ల రోడ్డుకు రూ.67కోట్లు మంజూరు
- నిధులు విడుదల కాగానే పనుల ప్రారంభం
- ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్ అర్బన్: షాద్‌నగర్-కొత్తూర్ మధ్య పాత జాతీయ రహదారి విస్తరణకు నిధుల విడదల కాస్త ఆలస్యమైనా... త్వరలోనే రానున్నాయని, రోడ్డు విస్తరణ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. గోతులమయమైన పాత జాతీయ రహదారిని పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్న సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. కొత్తూర్ నుంచి ఫరూఖ్‌నగర్ మండలంలోని సోలీపూర్ వై జంక్షన్ వరకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఉందన్నారు. దాన్ని ఆర్‌అండ్‌బీకి మార్పు చేశామని తెలిపారు. పాత జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం సిద్ధంగా లేకున్నా తాను పట్టుబట్టి నాలుగు లేన్ల రోడ్డు వెడల్పునకు 67కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. గత ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ రోడ్డు విస్తరణ కు శంకుస్థాపన చేసినా... అసెంబ్లీతో పాటు వివిధ ఎన్నికలు రావడం, కొవిడ్ ఉండడంతో నిధుల వి డుదల జాప్యం మైందన్నారు. రోడ్డు విస్తరణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో నాలు గు లేన్లుగా మారుస్తామన్నారు. ప్రస్తుతం మరమ్మతులు, ప్యాచ్ వర్క్ చేయిస్తామని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని అంజయ్యయాదవ్ అన్నారు.