యాసంగికి సమాయత్తం

ABN , First Publish Date - 2020-12-01T05:38:21+05:30 IST

యాసంగికి సమాయత్తం

యాసంగికి సమాయత్తం
యాసంగి సాగుకు ట్రాక్టర్‌తో దుక్కులు దున్నుతున్న దృశ్యం

  • దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు 
  • విత్తనాలు అందుబాటులో లేక రైతుల ఇబ్బందులు 
  • సబ్సిడీ విత్తనాలు కరువు
  • కార్తెవచ్చి వారం అయినా సొసైటీలో ఒకేరకం వరి విత్తనం 
  • ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్న అన్నదాతలు

ఘట్‌కేసర్‌: యాసంగి సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వానాకాలంలో సాగుచేసిన వరి పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. అయినప్పటికీ భారీ వర్షాలు కురువడంతో భూగర్భ జలమట్టం పెరిగి ఎక్కడ చూసినా నేటికీ పలుచోట్ల పొలాల్లోంచి నీరు ప్రవహిస్తున్నది. దీనితో యాసంగిలో నీటి ఇబ్బందులు ఉండక పోవచ్చనే ధీమాతో రైతన్నలు పొలాలు దున్నుకునేందుకు పనులు మొదలుపెట్టారు. యాసంగి సీజన్‌ ప్రారంభమై 15రోజులు గడుస్తున్నా నేటికి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. గతంలో మండల రైతులకు రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఇటు ఘట్‌కేసర్‌లో అటు ఏదులాబాద్‌లో విత్తనాలను విక్రయించేవారు. కానీ ఈసంవత్సరం మాత్రం గురువారం నుంచి మొక్కుబడిగా వరివిత్తనాల విక్రయాలు చేపట్టారు. కేవలం ఎంటీయూ 1010 వరిరకానికి చెందిన ఒకేరకం విత్తనాల విక్రయాలు చేపట్టారు. దీనితో రైతులు వ్యవసాయ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల క్రితం పాత వంగడాలనే అందుబాటులో ఉంచడంతప్ప కొత్తరకాలను పరిచయం చేయడంలేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రస్తుత సీజన్‌లో సాగునీరు పుష్కలంగా ఉండటంతో పాటు వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా జరగడం వలన సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. వానాకాలంలో 4వేల 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుత యాసంగిలో దాదాపు 5వేల ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విత్తనాలపై ఎలాంటి సబ్సిడీలను ఇవ్వడంలేదు. దీనికి తోడు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం వలన రైతులు ప్రైవేటు విత్తన వ్యాపారులను అశ్రయించే పరిస్థితిని కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాల్లో విక్రయించే విత్తనాలు తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ రూపొందించినవే కావడంతో రైతులకు కొంత నమ్మకం ఉండేది. దానితోపాటు గతంలో కొంత సబ్సిడీని అందించే వారు. అన్నింటినీ ఎత్తేసి ప్రైవేటు విత్తన కంపనీలకు వంతు పాడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఘట్‌కేసర్‌ మండలంలో ఎక్కువ వ్యవసాయ భుములు మూసీ పరివాహక గ్రామాల్లోనే ఉన్నాయి. ఈభూముల్లో జింక్‌లోపం అధికంగా ఉంటుంది. దీనితో రైతులకు 50 శాతం సబ్సిడిపై జింక్‌ను అందించే వారు. కానీ ఈసీజన్‌కు సబ్సిడీ జింకు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాసంగి వరిసాగుకు సంబంధించి ఈనెల 19న గురువారం అనురాధ వారం కార్తే ప్రవేశించింది. ఈకార్తెలో నారు పోసుకొని నెల రోజుల్లోగా నాటు వేస్తే మంచి దిగుబడితోపాటు ఎండాకాలంలో వచ్చే వడగండ్ల వర్షాలు పడకముందే కోతకు వస్తుందని రైతుల నమ్మకం. దీని కారణంగా ఎక్కువ మంది రైతులు ఈకార్తేలోనే నార్లు పోసుకుంటారు. కాని విత్తనాల కొరతతో ఇప్పటికే 15రోజులు అలస్యం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వివిధ రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఒకే రకం విత్తనం అందుబాటులో ఉంది: బొక్క పోచిరెడ్డి, రైతు, బొక్కొనిగూడ


ఘట్‌కేసర్‌ సహకార సంఘంలో 1010 రకం వరి విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అది పాత వంగడం కావడంతో ఇష్టం లేక కొత్త రకం వంగడాల కోసం ప్రైవేటు దుకాణాలకు వెళ్లాల్సివస్తోంది. అదును దాటి పోతుండటంతో కొత్తవిత్తనం తెచ్చి నారు పోసుకున్నాను. సహకార సంఘంలో కొత్తరకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచాలి.


అదును దాటి పోతుంది: చందుపట్ల నర్సింహరెడ్డి, రైతు, చందుపట్లగూడ 


కార్తె ప్రవేశించి 15 రోజులు గడుస్తున్నది. ఇప్పటికీ సొసైటీలో విత్తనాలు లేవు. ఒక రకం విత్తనాలను విక్రయిస్తున్నారు. జింకు అందుబాటులో లేదు. పొల్లాల్లో జింకులోపం ఉందని అధికారులు గతంలో గుర్తించారు. జింకును దుక్కిలోనే వేయాలి. కాని సొసైటీలో జింకు లేదు. తర్వాత వేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రభుత్వం సబ్సిడీ జింకును అందించాలి. 


విత్తనాల కోసం నివేదిక అందించాం: బాసిత్‌ మండల వ్యవసాయ శాఖ అధికారి 


మండలానికి యాసంగి సీజన్‌కు అవసరమైన వరి విత్తనాల కోసం ఉన్నతాధికారుకు నివేదిక అందించాం. ప్రస్తుతం 1010 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ సోనాతోపాటు మరికొన్ని  రకాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వరి విత్తనాలకు ఎలాంటి సబ్సిడీలేదు.

Updated Date - 2020-12-01T05:38:21+05:30 IST