ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగం: సినీనటుడు సుమన్
ABN , First Publish Date - 2020-03-08T08:22:15+05:30 IST
అత్యవసర సమయంలో తనను తాను రక్షించుకునేందుకు అమ్మాయిలు ఖచ్చితంగా కరాటేపై అవగాహన కలిగి ఉండాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అత్యవసర సమయంలో...

ఆదిభట్ల : అత్యవసర సమయంలో తనను తాను రక్షించుకునేందుకు అమ్మాయిలు ఖచ్చితంగా కరాటేపై అవగాహన కలిగి ఉండాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అత్యవసర సమయంలో ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో ‘ఆమే ఆయుధం’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుమన్ విచ్చేశారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమన్ కరాటే దుస్తులతో అతి సూక్ష్మమైన మెలకువలు ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం నేడు అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, అందులో పురుషులకు సమానంగా మహిళల భాగసామ్యం ఉందన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తూ అనేక విజయాలను నమోదు చేసుకుంటున్న మహిళ నేటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలకు దీటుగా నేడు మన దేశం పురోగమిస్తున్న తరుణంలో నిర్భయ, దిశా వంటి అమానుష ఘటనలు జరగడం ఎంతవరకు క్షమార్హం కాదని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వ్యక్తికి కాలయాపన లేకుండా అతి తక్కువ కాలంలోనే శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన మెరుపు చర్యల గురించి మహిళలు, విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. అనంతరం కరాటే మాస్టర్ నరేందర్‌తో కలిసి దాదాపు రెండు గంటల పాటు అనేక ట్రిక్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 40మంది అమ్మాయిలు(విద్యార్థినులు) అబ్బురపరిచే విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్‌గౌడ్ కోషాధికారి మీనేంద్రరావు, సురేందర్ రెడ్డి, రఘుబాబు, ప్రోగ్రాం ఆర్గనైజర్ గ్రాండ్ మాస్టర్ నరేందర్, నలందా గ్రామర్ స్కూలు చైర్మన్ బెల్లి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.