తాండూరు బల్దియాలో అక్రమాలు

ABN , First Publish Date - 2020-03-08T08:04:33+05:30 IST

తాండూరు మున్సిపాలిటీలోని శానిటేషన్‌ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా 13 మంది పారిశుధ్య కార్మికుల నియామకాలపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది జవాన్ల ద్వారా ఆవిభాగంలో...

తాండూరు బల్దియాలో అక్రమాలు

  •  పారిశుధ్య విభాగంలో అడ్డదారిలో ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు
  •  సీడీఎంఏ అప్రోల్‌ లేకుండానే జీవోఎంఎస్‌-52 ఉల్లంఘన

తాండూరు : తాండూరు మున్సిపాలిటీలోని శానిటేషన్‌ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా 13 మంది పారిశుధ్య కార్మికుల నియామకాలపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది జవాన్ల ద్వారా ఆవిభాగంలో పనిచేసే అధికారి ఒకరు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. జీవో-52 ప్రకారం జూన్‌ 2017 తర్వాత ఖాళీలు ఏర్పడిన స్థానంలో సీడీఎంఎ అప్రోల్‌ లేనిదే నియమించరాదని జీవోఉంది. ఇదేఅంశంపై గతకౌన్సిల్‌లో కొందరు కౌన్సిలర్లు డీసెంట్‌ నోటీసులు కూడా ఇచ్చారు.    డీసెంట్‌పై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ అక్రమ నియామకాలు చేపడుతున్నారు. 13 మంది నియామకాల్లో ఎలాంటి పారదర్శకత లేదు.


కార్యాలయంలో  నియమించిన ఆపరేటర్‌ నియామక విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి నిబంధన పాటించలేదు. మున్సిపాలిటీకి కొత్తగా మూడు ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్‌, 10 ఆటోలు మంజూరయ్యాయి. వాటికి అత్యవసరంగా డ్రైవర్లను నియమించారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడం, కౌన్సిల్‌లో చర్చకు వస్తుందని వారిని వెంటనే  తొలగించారు. మున్సిపల్‌లో కొన్నేళ్లు పనిచేస్తున్న ఒక ఉద్యోగి కుమారుడిని డబ్బులకు కక్కుర్తిపడి కొత్త మున్సిపల్‌ కార్యాలయం వాచ్‌మెన్‌గా నియమించారు. తాండూరు మున్సిపాలిటీలో ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లు అంబిక, గీతాబాయిలను అనారోగ్యం కారణంగా ఉద్యోగం మానేయగా, మరో వర్కర్‌ జె.బాలమ్మ మృతి చెందింది. అయితే వీరి స్థానాల్లో నిబంధనల మేరకు వారసత్వానికి సంబంధించిన వ్యక్తులను నియామకాలు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ అయిన మూడుస్థానాల్లో ముగ్గురిని నియమించుకుని, ఒక్కొక్కరి వద్దపెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని  నియమించుకున్నారు. ఆ ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించలేదు. 


కాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉండగా, తాండూరు మున్సిపాలిటీలోమాత్రం ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. మ్యాన్యువల్‌ పద్దతినే అమలు చేస్తున్నారు. రెగ్యూలర్‌ ఉద్యోగి ఒక్కరోజు గైర్హాజరు అయితే ఒక్క ఉద్యోగి రూ.1200ల వరకు వేతనంలో కోత విధిస్తారు. అయితే గైర్హాజరైనా హాజరైనట్లు రాసుకుని అట్టి డబ్బులను సంబంధిత జవాను, ఆ శాఖలో పనిచేసే అధికారి స్వాహా  చేస్తున్నారు. నెలనెలా ఈ విధానం వల్ల లక్షల్లో నష్టం వస్తున్నట్లు సమాచారం. 


పరిశీలిస్తున్నాం

తాండూరు మున్సిపాలిటీలో తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేకంటే ముందు శానిటేషన్‌ విభాగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రెండు,మూడు సార్లు నా దృష్టికి వచ్చాయి. వాటిపై పరిశీలిస్తున్నాము. బయోమెట్రిక్‌ విధానం పూర్తిగా అమల్లోకి తీసుకొస్తాము. 

- శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌, తాండూరు మున్సిపాలిటీ

Updated Date - 2020-03-08T08:04:33+05:30 IST