కరోనా ప్రభావంతో దుకాణాలు వెలవెల

ABN , First Publish Date - 2020-03-18T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ఒకరకమైన ఎమర్జెన్సీ వాతావరణం నెలకొనడంతో గిరాకీ లేక దుకాణాలు వెల వెలబోతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, హోల్‌సేల్‌ దుకాణాలు గిరాకీ లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా ప్రభావంతో దుకాణాలు వెలవెల

మేడ్చల్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో ఒకరకమైన ఎమర్జెన్సీ వాతావరణం నెలకొనడంతో గిరాకీ లేక దుకాణాలు వెల వెలబోతున్నాయి.   షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, హోల్‌సేల్‌ దుకాణాలు గిరాకీ లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటీవ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  ఇళ్ల నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, సినిమా హాళ్లు, పర్మిట్‌ రూంలను బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఓ వైపు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా అదే  రీతిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర సరుకుల కోసం మినహా బయట ఎక్కడ కూడా పెద్దగా రద్దీ కనిపించడం లేదు. రోడ్లపై కూడా రద్దీ తగ్గింది. హాస్టళ్లు మూసివేయడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి ఏ వైపు నుంచి వస్తుందో తెలియక తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి మాస్క్‌లు, ఖర్చీ్‌పలు వంటివి కట్టుకుని బయటకు వస్తున్నారు. మేడ్చల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులు లేక వెల వెల బోతోంది. ముందస్తుగా అధికారులు మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-03-18T05:30:00+05:30 IST