పరిగి రాంరెడ్డి ఇక లేరు..

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

రాజకీయ ఉద్దండుడు, విద్యావేత్త, మాజీ మంత్రి కమతం(పరిగి) రాంరెడ్డి(83) ఇక లేరు.

పరిగి రాంరెడ్డి ఇక లేరు..
కమతం మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఉమ్మడి రాష్ట్ర  రాజకీయాల్లో కీలక భూమిక 
  • పరిగిపై కమతంది చెరగని ముద్ర


పరిగి: రాజకీయ ఉద్దండుడు, విద్యావేత్త, మాజీ మంత్రి కమతం(పరిగి) రాంరెడ్డి(83) ఇక లేరు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, ఒక వెలుగువెలిగిన రాంరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని ఓ ఆస్పత్రిలో చికత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. 55ఏళ్ల రాజకీయ చరిత్రలో గొప్ప నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమతంకు కుమారుడు శ్రీనివా్‌సరెడ్డి, ముగ్గురు కూతుళ్లు రజిత, విజిత, సుజితలు ఉన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, పీవీ, మన్మోహన్‌సింగ్‌లతో సత్సంబంధాలు కలిగిన నేతగా ఎదిగారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో  పీవీ, మర్రి, అంజ య్య, జలగం, కోట్ల, నేదురుమల్లి ప్రభుత్వాల్లో కూడా కీలకంగా పనిచేశారు. అప్పటి సీఎం రోశయ్య, వైఎస్‌ఆర్‌లు కూడా కమతం సలహాలు తీసుకునేవారు. కమతం మృతి పట్ల సీఎం కేసీఆర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. 


 అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి కమతం రాంరెడ్డికి శనివారం సాయం త్రం మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌ గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కమతం మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి ఆయన సొంత వ్యవసాయక్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి పాడె మోశారు. రాష్ట్ర మంత్రులు సబితారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డిలతోపాటు, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 


కమతం గురించి..

గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌ గ్రామంలో కమతం రంగమ్మ, లక్ష్మారెడ్డిలకు 1937లో నవంబర్‌ 1న కమతం  రాంరెడ్డి మొదటి సంతానంగా జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. అప్పట్లో లా కళాశాల కార్యదర్శిగా పని చేశారు. పరిగి నుంచి కమతం మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పట్లో పీవి మంత్రివర్గంలో పౌరసరపరాల మంత్రిగా... నేదురుమల్లి, కోట్ల మంత్రి వర్గంలో మార్కెటింగ్‌, రెవెన్యూ శాఖలకు మంత్రిగా పని చేశారు. 2018లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కమతం కొడుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రస్తుతం గండీడ్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు.


పరిగిపై చెరగని ముద్ర

కమతం రాంరెడ్డి యాభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో పరిగి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పరిగిలో ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి ఆయన కృషియే. కమతం ఇక లేకపోయినా అప్పట్లో పరిగిలో బస్‌స్టేషన్‌, పాలకేంద్రం, లక్నాపూర్‌, సాలార్‌నగర్‌, అంతారం ప్రాజెక్టు, పుట్టపహాడ్‌, నంచర్ల పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయించి చెరగని ముద్ర వేశారు.


‘కమతం’ మృతి బాధాకరం : మంత్రి సబితారెడ్డి

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / రంగారెడ్డి అర్బన్‌) : మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి మృతి చెందటం బాధాకరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని ఆమె తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST