రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్‌దే..

ABN , First Publish Date - 2020-12-07T04:51:42+05:30 IST

ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్‌దే..
మోమిన్‌పేట రైతువేదికను ప్రారంభిస్తోన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి

  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ధారూరు / మోమిన్‌పేట : ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం కెరెల్లిలో, మోమిన్‌పేట మండల కేంద్రంలో, వికారబాద్‌ మండలం నారాయణపూర్‌లో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఆదివారం విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆహారం అందిస్తున్న రైతులు లాక్‌డౌన్‌ చేస్తే మానవజాతితోపాటు సృష్టిలోని జీవరాసుల ఊపిరి ఆగిపోతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి డబ్బులను ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ఆయన అన్నారు. రైతువేదికలు రైతులకు దేవాలయాలని, ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 2,604 రైతు వేదికల్లో డిజిటలైజేషన్‌ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు, తెగుళ్లకు ఏ మందులు పిచికారీ చేయాలని రైతులకు తెలిపే విధానాన్ని ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో రైతులకు నీళ్లందించేందుకు 140 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఎత్తిపోతల పథకం ఎక్కడా లేదని, కెరెల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల పథకం ముఖ్య సలహాదారు పెంటారెడ్డికే ఈ ఘనత దక్కుతుందని, ఆయన పని తనానికి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, ఈనెల 8న రైతులు తలపెట్టిన భారత్‌బంద్‌కు మద్దతుగా జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని తెలిపారు. పంటలకు మద్దతు ధర పెంచాలని తాము చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుం దని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సీట్లు సాధించడం బీజేపీ నాయకులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయిందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  ప్రజాస్వామ్యంలో చాలా ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని, ఓ ఎన్నికలో ఫలితం అనుకూలంగా వస్తే, మరో ఎన్నికలో రాకపోవచ్చని, మళ్లీ జరిగే ఎన్నికల్లో గొప్ప ఫలితం రావచ్చని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే ఎక్కువ స్థానాలు సాధించిందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థియే మేయర్‌ పీఠం అధిరోహించబోతున్నారని, దీంట్లో అనుమానమేమీ లేదన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ఇక్కడి రైతులకు నీరందించడమే లక్ష్యమని అన్నారు. 


శిలాఫలకంపై పేర్లు లేవని మండిపాటు

 కెరెల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవ శిలాఫలకంపై తమ పేర్లు లేకపోవడంపై రైతు బంధు మండల కన్వీనర్‌ రాంరెడ్డితో పాటు క్లస్టర్‌ సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులపై మండిపడ్డారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి రాకముందే శిలాఫలకంపై పేర్లు రాయలేదని అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు.  ఈ విషయాన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌ వై.సత్యనారాయణరెడ్డి సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ సందర్భంగా ఆదివారం అంబేద్కర్‌ 64వ వర్ధంతి సందర్భంగా మోమిన్‌పేట మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ పౌసుమిబసు, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సాగునీటి శాఖ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ జడ్పీవై్‌సచైర్మన్‌ విజయ్‌కుమార్‌, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీపీ వసంతవెంకట్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేషం, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, స్థానిక సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, అధికారులు వినోద్‌కుమార్‌, గోపాల్‌, ప్రణీత్‌, రాధ, శాంత, గఫార్‌, ఏఈవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:51:42+05:30 IST