కొండకల్‌లో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ

ABN , First Publish Date - 2020-08-12T09:57:35+05:30 IST

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న శంకర్‌పల్లి మండలానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రావడంతో స్థానిక యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు

కొండకల్‌లో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ

95 ఎకరాల్లో రూ.800 కోట్లతో నిర్మాణం 

ఈనెల 13న శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్‌ 

స్థానికులకు ఉద్యోగాలివ్వాలని గ్రామస్థుల డిమాండ్‌


శంకర్‌పల్లి : హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న శంకర్‌పల్లి  మండలానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రావడంతో స్థానిక యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం 2017 అక్టోబర్‌లో 95 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. కొండకల్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 310లో రైల్వే మెట్రో కోచ్‌ల తయారీ కేంద్రం సుమారు రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేద సర్వో డ్రైవ్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2వేల మందికి, పరోక్షంగా మరో రెండు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే ఈనెల 13వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. 


పరిశ్రమలో ఒక విభాగంలో 500 మంది ఇంజినీర్లు పనిచేయనున్నారు. అలాంటి విభాగాలు మరెన్నో ఉన్నాయి. ఇండియన్‌ రైల్వేకు చెందిన ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తులను సరఫరా చేయడంలో హైదరాబాద్‌కు చెందిన మేద సర్వో డ్రైవ్స్‌ కంపెనీ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇలాంటి ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పలువురికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ సంస్థ 1983లో రూ.25 కోట్లతో ప్రారంభమై నేడు వేయి కోట్ల కొనసాగుతోంది. వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి ఇంజినీర్లను ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయి. కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సుమారు 80 కుటుంబాలు తమ భూములను ప్రభూత్వానికి అప్పగించాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

తమ గ్రామానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రావడం సంతోషకరం. కానీ గ్రామంలో 80 కుటుంబాలు వారి జీవనాధారమైన పొలాలను ప్రభుత్వానికి అప్ప గించాయి. గతంలో రైతులు ధర్నాలు నిర్వహించిన సమయంలో కంపెనీ ప్రతినిధులు 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలి.

- ప్రతా్‌పరెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు

Updated Date - 2020-08-12T09:57:35+05:30 IST