మర్పల్లి, అల్లాపూర్‌ పంచాయతీలకు మహర్దశ.. ఎస్సీ కాలనీల్లో కొనసాగుతున్న పనులు

ABN , First Publish Date - 2020-12-11T03:46:52+05:30 IST

మర్పల్లి, అల్లాపూర్‌ పంచాయతీలకు మహర్దశ.. ఎస్సీ కాలనీల్లో కొనసాగుతున్న పనులు

మర్పల్లి, అల్లాపూర్‌ పంచాయతీలకు మహర్దశ.. ఎస్సీ కాలనీల్లో కొనసాగుతున్న పనులు
మర్పల్లిలో చేపట్టిన డ్రైనేజీ పనులు

రూ.20 లక్షల చొప్పున ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన నిధులు మంజూరు 


బషీరాబాద్‌: ప్రతీ పల్లెను మోడల్‌ విలేజ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం  ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు బషీరాబాద్‌ మండలంలోని మర్పల్లి, అల్లాపూర్‌(బి) గ్రామ పంచాయతీల్లోని ఎస్సీ కాలనీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూయయ్యాయి. ఈ నిధులతో ఆయా పంచాయతీల్లోని  సర్వేలో గుర్తించిన వివిధ అభివృద్ధి పనులకు పెద్దపీట వేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో  కేంద్ర ప్రభుత్వం  ఆయా పంచాయతీల్లో గతంలో అధికారులతో సర్వే చేయించి అభివృద్ధి పనులను గుర్తించింది. అప్పట్లో ఎస్సీ కాలనీలలో అవసరమయ్యే అభివృద్ధి పనులను పరిశీలించి పాలకవర్గాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇదివరకే ఎంపిక చేసిన రెండు గ్రామ పంచాయతీల్లో  అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను విడుదల చేసింది. 

పీఏంఏజీవై కింద చేపట్టే పనులివే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర నిధులతో గ్రామ పంచాయతీలో మొదట అంగన్‌వాడీ భవనం ఉందా లేదా గుర్తిస్తారు. లేకుంటే నిర్మాణం చేపట్టాలి. ఒకవేళ ఉన్నచో  కేంద్రంలో చిన్నారుల కోసం ఆట వస్తువులు, సామగ్రిని సమకూర్చాలి. అలాగే పాఠశాలల్లో  మూత్రశాలలు లేకుంటే నిర్మాణం చేపట్టాలి. అలాగే ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం వంటి పనులను చేపట్టనున్నారు. పీఏంఏజీవై నిధులతో మర్పల్లిలో ఇప్పటికే మురుగు కాల్వల నిర్మాణపనులు జోరుగా కొనసాగుతుండగా, అల్లాపూర్‌లోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టేందుకు సర్పంచ్‌ నిర్మల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.

 అంగన్‌వాడీ భవనం, డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నాం 

మా గ్రామ పంచాయతీకి పీఏంఏజీవై పథకం కింద రూ.20 లక్షలు నిధులు వచ్చాయి. ఈ నిధులతో అంగన్‌వాడీ భవనం నిర్మిస్తాం. ఎస్సీ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఎస్సీ కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై కొంత మేరకు స్థానికంగా సమస్యలు పరిష్కారం కానున్నాయి.

- జి.నీలమ్మ, సర్పంచ్‌, మర్పల్లి గ్రామ పంచాయతీ


Updated Date - 2020-12-11T03:46:52+05:30 IST