పది పరీక్షలకు సన్నద్ధం

ABN , First Publish Date - 2020-05-10T10:00:00+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను ఈనెలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు

పది పరీక్షలకు సన్నద్ధం

పాటించనున్న భౌతికదూరం,  పెరగనున్న పరీక్షాకేంద్రాలు

హాజరు కానున్న 49,756 మంది విద్యార్థులు

50 వేల మాస్క్‌లు సిద్ధం ఫ జిగ్‌జాగ్‌ పద్దతిలో సీటింగ్‌ 

కేంద్రానికో టెస్టింగ్‌ మిషన్‌,  శానిటైజర్లు సబ్బులు ఏర్పాటు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌):లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను ఈనెలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న సెంటర్లతో పాటు మరిన్ని సెంటర్లను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో తెలుగు, హిందీ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. 208 పరీక్ష కేంద్రాలో 49,756 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ జిగ్‌జాగ్‌ పద్దతిలో పిల్లలను కూర్చోబెట్టాల్సి వస్తుండటంతో అదనంగా మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.


ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కేంద్రాలు రెట్టింపు అవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు 416 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నారు. కరోనా వైరస్‌వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భౌతికదూరం పాటించాలనే నిబంధన అమలు చేసేందుకు పరీక్షా కేంద్రాలను పెంచేతూ ఒక్కో గదికి 10-12 మంది విద్యార్థులు కేటాయించనున్నారు. బేంచికో విద్యార్థి, పరీక్షా కేంద్రానికి సుమారు వంద నుంచి 120 మందిని మాత్రమే కేటాయించనున్నారు. జిల్లాలో 937 ఉన్నత పాఠశాలలు 47,155 మంది రెగ్యూలర్‌ విద్యార్థులు, ఒక్కసారి ఫెయిలై పరీక్ష రాసేవారు 1,450 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.


పరీక్షా కేంద్రాలను పెంచాల్సి వస్తుండటంతో కొత్తగా హాల్‌టికెట్లను ముద్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కాటన్‌క్లాత్‌తో కుట్టించిన 50 వేల మాస్కులను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచనున్నారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యాలపైనా అధికారులు దృష్టిపెట్టనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలలు తీసుకుంటున్నారు. 


ఆన్‌లైన్‌లో పాఠాలు...

 రెండు సబ్జెక్టుల పరీక్షలు రాసి మిగిలిన పరీక్షలు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి పాఠాలు రివిజన్‌ చేస్తూ విద్యార్థులకు మరింత చేరవ అయ్యేలా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. యూటూబ్‌తో పాటు టీశాట్‌ ద్వారా ఉదయం, సాయంత్రం వేళలో గంట చొప్పున పాఠశాలు బోధిస్తున్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని పిల్లలకు కేబుల్‌ ఆపరేటర్ల సహాయంతో లోకల్‌ చానల్‌లో పాఠశాలు భోధిస్తున్నారు. జిల్లాలోని పది మండలాల్లో డిష్‌ ద్వారా పాఠశాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 


ఉత్తమ ఫలితాలు సాధిస్తాం:  డీఈవో విజయలక్ష్మి 

ఈ సారి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తాం. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన పరీక్షలు ఈనెలాఖరు వరకు నిర్వహించే అవకాశాలు ఉండటంతో అందుకు తగ్గట్గుగా ఏర్పాట్లు చేస్తున్నాము. బేంచికి ఒకరు మాత్రమే కూర్చునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే 50 వేల మాస్క్‌లు, శానిటైజరు, పరీక్ష కేంద్రానికి ఒక టెస్టింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నాము. విద్యార్థులు సబ్జెక్టు మరిచిపోకుండా ఆన్‌లైన్‌ పాఠశాలు బోధిస్తున్నాము.

Updated Date - 2020-05-10T10:00:00+05:30 IST