రాష్ట్రేతరుల కదలికలపై పోలీసుల ఆరా!

ABN , First Publish Date - 2020-03-23T06:11:02+05:30 IST

షాద్‌నగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాష్ట్రేతరుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి మతప్రచారం కోసం వచ్చి కరీంనగర్‌లో..

రాష్ట్రేతరుల కదలికలపై పోలీసుల ఆరా!

షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాష్ట్రేతరుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి మతప్రచారం కోసం వచ్చి కరీంనగర్‌లో కరోనా కలకలం సృష్టించిన లాంటి సంఘటనలు షాద్‌నగర్‌లో చోటు చేసుకోకుండా పోలీసులు నిఘాను పెంచారు. జనతా కర్ఫ్యూ జరుగుతున్న ఆదివారం ఓ యువకుడు కుర్తాఫయిజామా వేసుకుని రెండు బ్యాగులు పట్టుకుని పట్టణంలో అనుమానాస్పదంగా తిరిగాడు. అతన్ని జర్నలిస్టులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఏసీపీ సురేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌లకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ విజయభాస్కర్‌ తన సిబ్బందితో కలిసి వచ్చారు. అప్పటికే అనుమానాస్పదంగా తిరిగిన యువకుడు చటాన్‌పల్లి రోడ్డులోని ఓ ఇంట్లోకు వెళ్లాడు. పోలీసులు వెళ్లి అతని బయటకు పిలిచి ప్రశ్నించారు. తన పేరు మహ్మద్‌ తహమీద్‌ అని, తనది బీహార్‌ రాష్ట్రమని చెప్పాడు. తాను మదర్సాల నిర్వహణ కోసం మసీదుల్లో చందాలు వసూలు చేయడానికి వచ్చానని చెప్పాడు.


ఈ రోజు లాడ్జిల్లో ఉండడానికి అవకాశం లేనందున తన స్నేహితుడు అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చానని చెప్పాడు. అతని స్నేహితుడు కూడా మూడు రోజుల క్రితమే వచ్చి ఇంటిని అద్దెకు తీసుకున్నాడని ఇంటి యజమాని చెప్పాడు. ఇద్దరు యువకులు చెప్పిన మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో జనతా కర్ఫ్యూ ముగిసేవరకు ఇంట్లోనే ఉండి, ఇక్కడి నుంచి సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని ఎస్‌ఐ విజయభాస్కర్‌ ఆదేశించారు. షాద్‌నగర్‌ పట్టణానికి విదేశాల నుంచి వచ్చినవారి వివరాలతో పాటు అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను సైతం తెలుపాలని చైర్మన్‌ నరేందర్‌ కోరారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తూ, సామాజిక బాధ్యతగా  కరోనా వ్యాప్తిని అరిగట్టడానికి చొరవ చూపాలని కోరారు.  

Read more