చమురు మంట

ABN , First Publish Date - 2020-06-22T10:20:50+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పెట్రో వినియోగం తగ్గి.. అంతర్జాతీయంగా చమురు ధరలు దారుణంగా పడిపోయాయి

చమురు మంట

పెరుగుతూనే ఉన్న పెట్రో ధర, డీజిల్‌ ధరదీ ఇదే దారి

లీటర్‌ పెట్రోల్‌ రూ.82.25,డీజిల్‌ రూ. రూ.76.49

15 రోజుల్లో పెట్రోల్‌పై రూ. 8.28, డీజీల్‌పై రూ.8.67 పెరుగుదల


చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. గత పదకొండు రోజుల నుంచి వరుసుగా ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు ఏమీ తోచడం లేదు. కరోనా కష్ట కాలంలో ఇలా చమురు ధరలు పెంచడం వలన మధ్యతరగతిపై అధిక భారం పడుతోంది. వైరస్‌ విస్తరిస్తుండటంతో చాలామంది సొంత వాహనాలకు ప్రాధాన్యమిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పెట్రో వినియోగం తగ్గి.. అంతర్జాతీయంగా చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా 15వ రోజు కూడా ధరలు పెరిగాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర 37 పైసలు, డీజిల్‌ ధర రూ.58 పైసలు పెంచాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ. రూ.82.25, డీజిల్‌ ధర రూ.76.49 చేరుకుంది. 15 రోజుల్లో పెట్రోల్‌ ధర రూ. 8.28, డీజిల్‌ ధర రూ.8.67 పెరిగింది. ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై చూపనుంది. కరోనా కా లంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు పెరుగుతున్న చమురు ధరలు భారంగా మారుతోన్నాయి. కరోనా సోకకుండా ఉండేందుకు కొందరు భౌతిక దూరం పాటించే ప్రయత్నం చేస్తున్నారు.


బస్సుల్లో ప్రయాణిస్తే.. ఎక్కడ వైరస్‌ సోకుతుందోననే భయంతో చాలా వరకు బైక్‌లు, కార్లలో ఉద్యోగాలకు వెళ్తున్నారు. సొంత వాహనాల్లో ప్రయాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చమురు వినియోగం కూడా పెరిగిపోయింది. నిత్యం పెరుగుతున్న చమురు ధరల కారణంగా సామాన్యుడు ఇంట్లోనుంచి బైక్‌ తీయాలంటేనే జంకుతున్నాడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ఉమ్మడి జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చమురు ధరలను అదుపులో ఉం చాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. 


పెట్రోల్‌, డీజిల్‌ సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి

పెట్రోల్‌, డీజిల్‌ సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జీఎస్టీ లోకి వస్తే... చమురు ధరలు సామాన్యులకు అందు బాటులో ఉంటాయి. లాక్‌డౌన్‌ సమయంలో చలి చప్పుడు చేయని చమురు సంస్థలు.. లాక్‌డౌన్‌ సడ లింపు తర్వాత ప్రతిరోజూ ధరలు పెంచేస్తున్నాయి.  పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. 

- జైపాల్‌రెడ్డి, ముద్దెంగూడ 


చమురు మంటతో నిత్యావసర ధరలు పెరుగుతాయు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగ డంతో నిత్యావసర సరుకులపై ప్రభావం పడుతుంది. దీంతో సామాన్య ప్రజలు ఎలా బతకాలో.. ఏం తినాలో.. తెలియడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి.

- గురుస్వామి, ఎర్రోనిగూడ 


ధరలు పెంచి ప్రజలపై భారం మోపొద్దు

కరోన నేథప్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ రోజురోజుకూ పెంచడం చాలా దారుణం. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయంతో అన్నివర్గాలపై ఆర్థిక భారం పడుతుంది. 

బి. చంద్రశేఖర్‌రెడ్డి, కారు డ్రైవింగ్‌ స్కూల్‌ యాజమాని, చేవెళ్ల

Updated Date - 2020-06-22T10:20:50+05:30 IST