పరిహారం అందేనా?

ABN , First Publish Date - 2020-11-22T05:05:32+05:30 IST

పరిహారం అందేనా?

పరిహారం అందేనా?
యాచారం : నానక్‌నగర్‌లో నీటమునిగిన వరి పంట (ఫైల్‌)

  • భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలు 
  • ఆమనగల్లు, యాచారం మండలాల్లో వేల ఎకరాల్లో పత్తి, వరి, కంది పంట నష్టం
  • వరద తాకిడికి పెట్టుబడులు కోల్పోయిన రైతులు  
  • పరిహారం కోసం ఎదురుచూపులు 


ఆమనగల్లు/యాచారం : ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి సీజన్‌లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. అతి వృష్టి, అనావృష్టి అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. ఫలితంగా పెట్టుబడులు కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. వానాకాలం సీజన్‌లో పంటలను చూసి ఈ ఏడాది అధిక దిగుబడులు వస్తాయని, తమ కష్టాలు తీరుతాయని భావించినా తీరా నిరాశే ఎదురవుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లోనూ ఆమనగల్లు మండలంలో పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు ముంచెత్తాయి. వరదతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన లక్షలాది రూపాయలు నీటి పాలయ్యాయి. ప్రభుత్వ ఆదేశం మేరకు నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా మండలంలో రైతులు ఎక్కువగా పత్తి, వరి, కంది పంటలు సాగు చేశారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుంటుందని రైతులు ఎదురుచూస్తున్నారు. 


10,811 ఎకరాల్లో పంట నష్టం


ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, శెట్టిపల్లి, ఆమనగల్లు, పోలెపల్లి, సింగంపల్లి, చెన్నంపల్లి, రాంనుంతల, కోనాపూర్‌, విఠాయిపల్లి, మేడిగడ్డ, మంగళపల్లి, చింతలపల్లి, సీతారామ్‌నగర్‌ తండా గ్రామాల్లో 10,811 ఎకరాల్లో పత్తి, వరి, కంది పంటలు దెబ్బతిన్నాయి. 559 మంది రైతులకు చెందిన 461 ఎకరాల వరి, 5,800 మంది రైతులకు చెందిన 10,329 ఎకరాల పత్తి, 482 ఎకరాల్లో కంది పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామాలు, రైతులు, విస్తీర్ణం వారీగా వ్యవసాయ శాఖ ఆధికారులు ప్రభుత్వానికి నష్టం అంచనా నివేదికలు అందజేశారు. ఆకుతోటపల్లిలో 54 ఎకరాల వరి, 1184 ఎకరాల పత్తి,  శెట్టిపల్లిలో 6 ఎకరాల వరి, 660 ఎకరాల పత్తి, ఆమనగల్లులో 190 ఎకరాల వరి, 5230 ఎకరాల పత్తి, పోలెపల్లిలో 68 ఎకరాల వరి, 1150, సింగంపల్లిలో వరి 22 ఎకరాలు, పత్తి 860 ఎకరాలు, చెన్నంపల్లి వరి 8 ఎకరాలు, పత్తి 95 ఎకరాలు, రాంనుంతల వరి 66 ఎకరాలు, పత్తి 595 ఎకరాలు, కోనాపూర్‌ వరి 14, పత్తి 350 ఎకరాలలో, విఠాయిపల్లిలో వరి 33 ఎకరాల్లో పంట దెబ్బతింది. 


పరిహారం కోసం ఎదురుచూపులు


భారీ వర్షాల కారణంగా పంట కోల్పోయిన రైతులు పరిహారం కోసం నెలల కాలంగా ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు పరిహారం అందిస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది మేర దిగుబడి వచ్చినా పంట తడిసి నల్లబారి వ్యాపారులు, కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదు. 


అమలుకు నోచని బీమా పథకం 


పంటల భీమా పథకం లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. భారీ వర్షాలు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు బీమా కొండంత అండగా నిలిచేది. అయితే, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా రద్దు చేసింది. దీంతో తీవ్రంగా నష్టపోయామని యాచారం మండంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


దెబ్బతిన్న పంటలు.. కుదేలైన అన్నదాతలు


యాచారం మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేతికందిన వరి, కూరగాయలు, జొన్న, కంది. పత్తి, ఆముదం తదితర పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది మెట్ట పంటలతో పాటు వరి ఎక్కువగా సాగు చేశారు. వరి 1,635 ఎకరాలు, జొన్న 880 ఎకరాలు, కంది 1380 ఎకరాలు, పత్తి 6,850 ఎకరాలు, ఆముదం 141 ఎకరాలు, కూరగాయలు 1,259 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, మండలంలో వర్షాల కారణంగా వివిధ గ్రామాల్లో పత్తి 854 ఎకరాలు, వరి 982 ఎకరాలు, ఆముదం 24ఎకరాలు, కూరగాయలు 541 ఎకరాల్లో నిట మునిగింది. మరో వైపు వింత తెగులుతో వరి పంట పాడై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Read more