నర్సరీలు రెడీ

ABN , First Publish Date - 2020-12-27T05:19:10+05:30 IST

నర్సరీలు రెడీ

నర్సరీలు రెడీ
కరీంగూడ నర్సరీలో మొక్కలకు నీరు పడుతున్నసిబ్బంది

  • హరితహారం మొక్కల పెంపకానికి సన్నాహాలు
  • గ్రామానికో నర్సరీ ఏర్పాటు
  • జిల్లాలో 69నర్సరీల్లో మొక్కల పెంపకం
  • పంచాయతీరాజ్‌ శాఖ 61, అటవీశాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీలు


హరితహారం కింద మొక్కలు పెంచేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను సిద్ధం చేస్తోంది. జిల్లాలో పంచాయతీ శాఖతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలను పెంచనున్నారు. 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో  హరితహారంలో భాగంగా నర్సరీల్లో  విరివిగా మొక్కలు పెంచేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 61గ్రామపంచాయతీలు, నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మునిసిపాలిటీల్లో పెంచనున్నారు.  పంచాయతీశాఖ ఆధ్వర్యంలో పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 61నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల్లో 31లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్‌ కవర్లు, మట్టి, ఎరువును సిద్ధం చేస్తున్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని 11పంచాయతీల్లో 6.25లక్షల మొక్కలను పెంచనున్నారు. అదేవిధంగా కీసర మండలంలోని 10 పంచాయతీల్లో ఐదులక్షలు, మేడ్చల్‌ మండలంలోని 17పంచాయతీల్లో 8.75లక్షల మొక్కలు, మూడుచింతలపల్లి మండలంలోని 13 పంచాయతీల్లో ఆరులక్షలు, శామీర్‌పేట్‌మండలంలోని 10 పంచాయతీల పరిధిలో 5.75లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో నర్సరీలో పెరుగుతున్న మొక్కల్లో 10 శాతం చనిపోయినా నిర్ధేశించిన లక్ష్యానికి తగ్గకుండా ఉండేందుకు 15శాతం అదనంగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు.  ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు నర్సరీల్లో పెరుగుతోన్న మొక్కలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు. మొక్కల పెంపకానికి అటవీశాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీల ద్వారా 50 లక్షల మొక్కలు ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట్‌ మండలాల్లో  పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూల చెట్లు పెంపకం


హరితహారంలో ప్రధానంగా నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూలమొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టేకు, కానుగ, నేరేడు, ఈత, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫల్‌ పండ్ల మొక్కలను, చెరువు కట్టలపై ఈత, కర్జూర, తుమ్మ, గులాబీ, గన్నేరు, చామంతి, మల్లెపూలు, తదితర మొక్కలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రదేశాలతో పాటు ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, ప్రభుత్వరంగసంస్థల్లో, ప్రైవేట్‌సంస్థల్లో, రోడ్లకు ఇరువైపులా, ప్రతిఇంటివద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, ఉద్యాన, ఇరిగేషన్‌, ఆబ్కారీ, వ్యవసాయ, విద్యా, పరిశ్రమల, తదితర 30 శాఖల సమన్వయంతో నిర్ధేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేశాం : డీపీవో పద్మజారాణి


ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రతీ గ్రామానికి నర్సరీనీ ఏర్పాటు చేశాం. వీటిలో 2021-22 సంవత్సరంలో నాటాల్సిన మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హరితహారంలో జిల్లాకు అవసరమైన మొక్కలను పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.   

Updated Date - 2020-12-27T05:19:10+05:30 IST