-
-
Home » Telangana » Rangareddy » nivar toofan
-
‘నివర్’ షివర్
ABN , First Publish Date - 2020-11-28T05:27:40+05:30 IST
నివర్ తుఫాన్ ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉమ్మడి జిల్లాను చల్లని గాలలు చుట్టుముట్టాయి.

- తుఫాన్‌తో వణుకుతున్న జనం
- పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల చిరుజల్లులు
- రాత్రి వేళలో వీస్తున్న చల్లని గాలులు
- పంట కోతలను వాయిదా వేయాలంటున్న అధికారులు
- తాత్కాలికంగా నిలిపి వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్/ ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : నివర్ తుఫాన్ ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉమ్మడి జిల్లాను చల్లని గాలలు చుట్టుముట్టాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి వేణుమాధవ్ తెలిపారు. నివర్ తుఫాన్ కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటివరకు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యానికి నష్టం జరగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నివర్ తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
నివర్ తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేయడంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం తగ్గేవరకు అన్ని రకాల పంటల కోతలను వాయిదా వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. శని, ఆదివారాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, వరి తీసుకు రావొద్దని అధికారులు రైతులకు సూచిస్తు న్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల, మార్క్‌ఫెడ్ విభాగాలు కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటు న్నాయి. రంగారెడ్డి జిల్లాలో 25ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 18 మొక్కజొన్న కేంద్రాలు, 15 సీసీఐ సెంటర్లు తాత్కా లికంగా మూసివేశారు.
వికారాబాద్ జిల్లాలో ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ రైతులను అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావం ముగిసే వరకు రైతులు కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసు కురాకుండా, కల్లాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడవకుండా రైతుల కు సూచనలు చేశారు. వర్షానికి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్లు కప్పారు. కురిసిన వర్షానికి పాడవకుండా ధాన్యం కాపాడుకో గలిగినా పొలాల్లో ఇంకా తీయని చివరి పత్తి మాత్రం తడిసి రంగు మారితే కనీస మద్దతు రాదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మరో వారం, పది రోజుల్లో పత్తి తీయడం పూర్తవుతుందని భావిస్తున్న సమయంలో నివర్ తుఫాన్ రూపంలో నష్టం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి గాలుల ప్రభావంతో పెరగనున్న తేమతో మద్దతు ధర రాక రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొననున్నాయి.
చల్లబడిన వాతావరణం
నివర్ తుఫాన్ ప్రభావంతో చల్లనిగాలులు బలంగా వీస్తుండడంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చలిగాలులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు నివర్ తుఫాన్‌తో గజగజ వణుకుతున్నారు. చలితీవ్రత అధికం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. చలి గాలుల తీవ్రత ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. నివర్ తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉంది.