చనిపోయిన ఆ మహిళకు కరోనా అని తేలడంతో.. ఐదు గ్రామాల్లో కొత్త టెన్షన్..!

ABN , First Publish Date - 2020-04-07T18:10:00+05:30 IST

నందిగామ మండలం చేగూరు గ్రామంలో కరోనా వ్యాధితో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ప్రాథమికంగా వైద్యం చేసిన ఇద్దరు ఆర్‌ఎంపీ వైద్యులు

చనిపోయిన ఆ మహిళకు కరోనా అని తేలడంతో.. ఐదు గ్రామాల్లో కొత్త టెన్షన్..!

చేగూర్‌లో కరోనాతో మృతిచెందిన మహిళ బంధువులకు, ఆర్ఎంపీలకు చేయని కరోనా పరీక్షలు

క్వారంటైన్‌లోనే ఉంచిన వైద్యులు

భయాందోళనలో ఐదు గ్రామాల ప్రజలు


షాద్‌నగర్‌అర్బన్ (రంగారెడ్డి జిల్లా)‌: నందిగామ మండలం చేగూరు గ్రామంలో కరోనా వ్యాధితో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ప్రాథమికంగా వైద్యం చేసిన ఇద్దరు ఆర్‌ఎంపీ వైద్యులు, మృతురాలి బంధువులకు వైద్య పరీక్షలు చేయకపోవడంతో మండలంలోని ఐదు గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైద్యపరీక్షలు నిర్వహించక పోవడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొదుతూ ఈనెల 1న మృతి చెందిన మహిళకు కరోనా వైరస్‌ ఉందన్న విషయం వెల్లడించకుండా ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.


వారు మరుసటి రోజు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు చేగూరు గ్రామస్థులతోపాటు వివిధ గ్రామాలకు చెందిన బంధువులు హాజరయ్యారు. మృతురాలికి కరోనా సోకినట్లు ఈనెల 3న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామానికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులతోపాటు అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించారు. ఆమె ఇంట్లో అద్దెకుంటున్న బిహారీ యువకులను, ప్రాథమికంగా వైద్యం చేసిన ఇద్దరు ఆర్‌ఎంపీ వైద్యులను సైతం క్వారంటైర్‌కు తరలించారు.


సోమవారం వరకు 95 మందిని పంపించారు. ఆర్‌ఎంపీ వైద్యులు షాద్‌నగర్‌లోనే నివాసముండేవారు. ఇద్దరిలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు విఠలయ్య సొంత గ్రామమైన మధురాపురం కావడం, అక్కడ ఒకరికి వైద్యం చేశాడు. గ్రామస్థులు కూడ వచ్చి కలిసి ఉంటారన్న ఆలోచనతో మధురాపురం గ్రామస్థులతోపాటు షాద్‌నగర్‌లో ఉత్కంఠ నెలకొంది. వారందరిని రాజేంద్రనగర్‌ క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్‌లో ఉన్న ఇతర గ్రామాలకు చెందిన వారికి వైద్య పరీక్షలు చేసి, వెనువెంటనే ఫలితాలు వెల్లడిస్తే ఐదు గ్రామాల్లో ఉత్కంఠ వీడే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-04-07T18:10:00+05:30 IST