-
-
Home » Telangana » Rangareddy » netturodina roads
-
నెత్తురోడిన రోడ్లు.. అదుపుతప్పుతున్న ద్విచక్ర వాహనాలు
ABN , First Publish Date - 2020-12-11T05:28:46+05:30 IST
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆమనగల్లు, యాచారం, కొడంగల్ మండలాల్లో బైక్‌లు అదుపుతప్పి ఐదుగురు దుర్మరణం చెందగా, కీసర పెద్దమ్మ చెరువు సుందరీకరణ పనులు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు.

- ఉమ్మడి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
- అదుపుతప్పుతున్న ద్విచక్ర వాహనాలు
- సుందరీకరణ పనులు చేస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన లారీ
ఆమనగల్లు : శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, ఆమనగల్లుకు చెందిన మహ్మద్‌రషీద్ (48), తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట్‌కు చెందిన ఉస్సేన్‌జీ(51) బైక్‌పై ఆమనగల్లు నుంచి కల్వకుర్తి వైపు వెళుతున్నారు. మేడిగడ్డ బ్రిడ్జి మలుపు వద్ద బైక్ అదుపుతప్ప్డి డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొంది. రషీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉస్సేన్‌జీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై ధర్మేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి బైక్ బోల్తా..
యాచారం: బైక్ అదుపుతప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన తమ్మలోనిగూడ వద్ద జరిగింది. మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన కంకర్ల వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మండలపరిధి రాయపోల్ గ్రామానికి చెందిన బంధువు సత్యవీరారెడ్డితో కలిసి శుభకార్యం కోసం ఫంక్షన్‌హాల్ బుక్‌చేయడానికి బైక్‌పై యాచారం వస్తున్నారు. సాగర్ ప్రధానరహదారి తమ్మలోనిగూడ గేటువద్ద బైక్ అదుపు తప్పికిందపడడంతో బైక్‌నడుపుతున్న వెంకట్‌రెడ్డి తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిట్లపల్లి శివారులో...
కొడంగల్: బైక్‌పై నుంచి కిందపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన కొడంగల్ మండలం చిట్లపల్లి శివారులో చోటు చేసుకుంది. బొంరా్‌సపేట్ మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన రాములు (32),మల్లయ్య (25) ద్విచక్రవాహనంపై గురువారం చిట్లపల్లికి బయలుదేరారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు చిట్లపల్లి శివారులో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు.
వ్యక్తిపైకి దూసుకెళ్లిన లారీ
కీసర: కీసర పెద్దమ్మ చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ అబ్దుల్, మోసిన్, హరినాథ్ గురువారం సుందరీకరణ పనులు చేస్తుండగా, కీసర నుంచి అంకిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్తున్న లారీ అదుపుతప్పి అబ్దుల్‌ను ఢీకొట్టి చెరువుకట్టపైకి దూసుకెళ్లింది. దీంతో అబ్దుల్‌కు తీవ్ర గాయాలు కాగా, మోసిన్, హరినాథ్‌లకు స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నగరానికి తరలిస్తుండగా, ఇసీఐఎల్ సమీపంలో అబ్దుల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.