సర్కారు దవాఖానాలో.. సూదుల్లేవ్‌!

ABN , First Publish Date - 2020-03-12T06:52:52+05:30 IST

ప్రభుత్వా సుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తీర్చుదిద్దుతున్నామని అధికార పార్టీ నేతల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి.

సర్కారు దవాఖానాలో.. సూదుల్లేవ్‌!

ఆమనగల్లు: ప్రభుత్వా సుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తీర్చుదిద్దుతున్నామని అధికార పార్టీ నేతల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిరంజీలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి ఈ సమస్య ఎదుర్కొంటున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో సర్కార్‌ ఆసుపత్రిలో సిరంజీలు లేకపో వడం విమర్శలకు తావిస్తుంది. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి వస్తున్న రోగులు విధిలేక మార్కెట్లో మెడికల్‌ షాపులకు వెళ్లి సూదులు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.


అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి ఆసుపత్రకి వచ్చే వారు బయట నుంచి సిరంజీలు తెచ్చుకోవడం ఇబ్బంది కరంగా పరిణమిస్తుంది. సర్కార్‌ ఆసుపత్రికి సమీపంలో ఎక్కడా కూడా మెడికల్‌ షాపులు అందుబాటులో లేవు. దీంతో అర కిలోమీటర్‌ దూరం నడిచివెళ్లి సూదులు కొనాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా తయారైంది. ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రి నాలుగు మండలాలకు కూడలిగా ఉంది. నిత్యం హాస్పిటల్‌కు ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల నుంచి 200లకు పైగా రోగులు వస్తుంటారు. అందులో సగానికి పైగా ఇంజెక్షన్లు అవసరమైన వారే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సిరంజీలు లేని కారణంగా డాక్టర్లు రోగులకు బయట నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.


దీంతో కొందరు రోగులు వెంట వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. సిరంజీలు లేని కారణంగా రోగులు వందల మంది ప్రైవేట్‌ మందుల షాపుల్లో ఒక్కొ దానికి రూ.5 వెచ్చించాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో ఇకల రోగుల బాధలు వర్ణణాతీతం. ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రిలో సిరంజీల కొరత విషయాన్ని గత నెలలో రోగులు, కొందరు స్థానిక నాయకులు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఒకటి, రెండు రోజులకు సరిపడా సిరంజీలు కొనుగోలు చేసి ఆసుపత్రి సిబ్బందకి అందజేశారు. కానీ, మళ్లీ యథావిధిగా సమస్య మొదలైంది. విషయాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడం గమనార్హం. ఇటీవల పట్టణప్రగతిలో భాగంగా ఆసుపత్రి సందర్శనకు వచ్చిన మంత్రి సబితాఇంద్రారెడ్డికి కూడ ఆసుపత్రిలో సిరంజీల కొరత గురించి రోగులు, స్థానికులు విన్నవించారు.


అందుకు ఆమె స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. సర్కార్‌ ఆసుపత్రులను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని చెబుతో ంది. కానీ, ఆమనగల్లులో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో మౌలిక వసతులు కూడ కరువయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్పందించి ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రిలో సిరంజీల సమస్యను పరిష్కరించి రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-03-12T06:52:52+05:30 IST