రైతు వేదికలపై నజర్‌

ABN , First Publish Date - 2020-05-29T09:44:37+05:30 IST

రైతులకు సంపూర్ణ సహకారం అందించేందుకు తెలంగాణ సర్కార్‌ నూతన ఒరవడికి శ్రీకారం

రైతు వేదికలపై నజర్‌

త్వరలో నిర్మించేందుకు అధికారుల చర్యలు 

క్లస్టర్‌కు ఒకటి చొప్పున నిర్మించాలని నిర్ణయం 

ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భూ సేకరణ పూర్తి


రైతులు ఆర్థికంగా బలపడి స్వయం సమృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. రైతు సంఘాలను బలోపేతం చేయడానికి రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం భూసేకరణ చేసి, అవసరమైన నిధులను కేటాయించింది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  రైతులకు సంపూర్ణ సహకారం అందించేందుకు తెలంగాణ సర్కార్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతులు ఒకేచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని సంకల్పించింది. ఇం దుకోసం భూసేకరణ చేసి, అవసరమైన నిధులను కేటాయించింది. పనులను చేపట్టేందుకు వ్యవసాయశాఖను సిద్ధం చేస్తోంది. పెట్టుబడి నుంచి పంట అమ్ముకునేందుకు అవసరమైన అన్ని సేవలను అందించేందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 83 క్లస్టర్లు ఉండగా.. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో రైతువేదికను నిర్మించనున్నారు.


ఇప్పటికే 60కిపైగా క్లస్టర్లకు భూములను గుర్తించారు. మిగిలిన వాటికి అనువైన స్థలాలు లభించడం లేదు. వీటికి కూడా స్థలాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. స్థలాలు గుర్తించిన వెంటనే రైతు వేదికలను నిర్మించేందుకు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ.12.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. 


అలాగే వికారాబాద్‌ జిల్లాలో 99 క్లస్టర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికను నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 9 క్లస్టర్లలో 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెలలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతు వేదికల్లో ఏఈవో గది, మరోవైపు రైతుల సమావేశ మందిరం, వ్యవసాయ పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ నిర్మించనున్నారు. ఇకపై గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధి, విత్తనాల కొనుగోళ్లు, భూసార పరీక్షలు మొదలగు పంట ధరలను నిర్ణయించే వరకు ఈ వేదిక కేంద్రంగానే కార్యక్రమాలు కొనసాగనున్నాయి.


ఈ రైతు వేదికలను బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా నిర్మిస్తున్నారు. దీనిద్వారా రైతు సంఘాలు బలోపేతం కానున్నాయి. ఈ రైతు వేదికల నిర్మాణంతో ఏఈవోల సేవలు విస్తృతం కానున్నాయి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. రైతులంతా ఒకచోట చేరడంతో వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పరస్పరం తెలుసుకోను న్నారు. రైతులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు, రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ, భూసార పరీక్షలు ఇతర కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిచేందుకు వీలుంటుంది.

Updated Date - 2020-05-29T09:44:37+05:30 IST