నమ్మించి కడతేర్చి..

ABN , First Publish Date - 2020-11-26T06:21:07+05:30 IST

నమ్మించి కడతేర్చి..

నమ్మించి కడతేర్చి..
పోలీసుల అదుపులో నిందితుడు కుమార్‌

  • కాళ్ల కడియాల కోసం మహిళ దారుణహత్య
  • పది రోజుల్లో కేసు ఛేదించిన మేడ్చల్‌ పోలీసులు
  • ఒంటరి మహిళలు అజ్ఞాత వ్యక్తులను నమ్మవద్దు :డీసీపీ  


మేడ్చల్‌: ఈనెల 16న మేడ్చల్‌ డబిల్‌పూర్‌ పరిధిలోని ఓ వెంచర్‌లో హత్యకు గురైన మహిళకు సంబంధించిన కేసును కేసును మేడ్చల్‌ పోలీసులు ఛేదించారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ బుధవారం మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భర్త మృతిచెందడంతో బతుకుదెరువు కోసం పరిశ్రమకు వచ్చిన మహిళను అక్కడే పనిచేస్తున్న ఓ వ్యక్తి నమ్మించి కడతేర్చినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన సమయానికి మహిళ మృతిచెంది నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయేస్థితికి చేరినట్లు చెప్పారు.  ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. పూర్తి సాంకేతికను ఉపయోగించుకుని ఎట్టకేలకు పది రోజుల్లో కేసును ఛేదించగలిగామన్నారు. దాదాపు 42 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుని గుర్తించినట్లు తెలిపారు.  మెదక్‌ జిల్లా చేగుంట గ్రామానికి చెందిన లక్ష్మీ(30) భర్త మృతిచెందడంతో ప్రతి రోజు రైలు ద్వారా డబిల్‌పూర్‌కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ తిరిగి సాయంత్రం చేగుంటకు వెళ్లేది. ఈ క్రమంలో ఇటీవల డబిల్‌పూర్‌ పరిధిలోని ఓ పరుపుల కంపెనీలో పనిచేస్తున్న లక్ష్మీకి అదే కంపెనీలో పనిచేస్తున్న కుమార్‌(33)తో పరిచయం ఏర్పడింది. లక్ష్మీకి భర్త లేడన్న విషయం తెలుసుకున్న కుమార్‌ మాయమాటలతో నమ్మించి లక్ష్మీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న సాయంత్రం కుమార్‌ లక్ష్మీని తీసుకుని డబిల్‌పూర్‌లో నర్సింహ అనే స్నేహితుడి గదికి తీసుకువెళ్లి పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం నర్సింహా అదేరోజు రాత్రి 8గంటలకు తన బైక్‌పై కుమార్‌, లక్ష్మీలను డబిల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలేశాడు. రైల్వేస్టేషన్‌ వద్ద కుమార్‌ మద్యం మత్తులో ఉన్న లక్ష్మీ కాళ్ల కడియాలపై కన్నేసి బలవంతంగా తీసేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న లక్ష్మీ కొద్దిగా ప్రతిఘటించడంతో కుమార్‌ బలంగా తోయడంతో కిందపడి లక్ష్మీ స్పృహతప్పిపోయింది. దీంతో ఆమెను సమీపంలో గల మహాలక్ష్మీ వెంచర్‌లోకి తీసుకువెళ్లి కాళ్ల కడియాలు తీసుకుని లక్ష్మీ చీరతోనే మెడకు చుట్టి హత్యచేశాడు. అదే చీరతో కాళ్లు, చేతులు కట్టేసి ఓ చెట్టుకు కట్టి వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఒంటరి మహిళలు అజ్ఞాత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. సమావేశంలో డీఐ జేమ్స్‌బాబు, ఎస్‌ఐ అప్పారావులు పాల్గొన్నారు. పది రోజుల్లోనే కేసును చాకచక్యంగా ఛేదించిన మేడ్చల్‌ పోలీసులను డీసీపీ అభినందించారు.

Updated Date - 2020-11-26T06:21:07+05:30 IST