ఉన్నోడికో లెక్క.. పేదోడికి మరో లెక్క!
ABN , First Publish Date - 2020-12-14T04:51:49+05:30 IST
ఉన్నోడికో లెక్క.. పేదోడికి మరో లెక్క!

వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ అధికారుల తీరు అంతుపట్టడం లేదు. పెద్దలకు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం.. అన్న రీతిలో వారి పనితనం కనిపిస్తోంది. ఆదివారం ఉదయం బీజేఆర్ చౌరాస్తా నుంచి రామయ్యగూడ వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఓ దుకాణంపై ఉన్న రేకులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తొలగించారు. ఇదిలా ఉంటే ఆ పక్కనే వైన్స్ ఉందని, అక్కడికి పెద్ద మొత్తంలో ప్రజలు వస్తున్నందున ఆ రేకులను పెట్టుకోవడం జరిగిందని షాపు యజమాని జానిమియా తెలిపారు. పక్కనున్న రోడ్డుకు అడ్డంగా ఉన్న షాపును వదిలేసి పేదవాడినైనా తనపై అధికారులు దౌర్జన్యం చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలంపల్లి రోడ్డు పక్కన ఇరువైపులా ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నో దుకాణాలు వెలిసినా అధికారులు వాటిని కూల్చే ధైర్యం చేయట్లేదని పలువురు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు ఇష్టానుసారంగా పనిచేస్తున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.