మిషన్ స్లో..!
ABN , First Publish Date - 2020-03-02T11:07:14+05:30 IST
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని... గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలనే సంకల్పంతో తెలంగాణ సర్కార్ మిషన్ కాకతీయ

- నత్తలు నవ్వేల పనులు
- పట్టించుకోని అధికారులు
- ఇష్టారాజ్యంగా గుత్తేదారులుఫ బిల్లులు చెల్లింపుల్లో జాప్యం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని... గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలనే సంకల్పంతో తెలంగాణ సర్కార్ మిషన్ కాకతీయ పథకానికి అంకురార్పణ చేసింది. 2015సంవత్సరంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాలుగు విడతల్లో జిల్లాలోని చెరువులను బాగు చేయాలని నిర్ణయించింది కానీ.. అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. చాలాచోట్ల పనులు నిలిచిపోయాయి. మొదటి, రెండు విడతల్లో చూపిన ఉత్సాహం.. మూడు, నాలుగు విడతల్లో కనిపించడం లేదు. మొదటిదశలో ఏర్పాటు చేసిన పనుల్లో 90శాతం పూర్తయినప్పటికీ. రెండు, మూడు దశల్లో పనులు చాలావరకు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తుండటంతో పనులు నత్తలు నవ్వేలా సాగుతున్నాయి. కొన్ని చెరువుల్లో పనులు నిలిచిపోయాయి.
జిల్లాలో 2,033 చెరువులను ఐదేళ్ల కాలంలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 68,904 ఎకరాల విస్తీర్ణంలోని ఆయకట్టు భూములను సాగులోకి తీసుకురావాలని భావించారు. ఈపథకాన్ని ప్రారంభించి నాలుగేళ్లు కావొస్తున్నా.. నేటికీ పనులు పూర్తి కాలేదు మొదటి విడతలో 325 చెరువులను పునరుద్ధరించాల్సి ఉండగా 310 చెరువుల్లో పనులు జరిగాయి. ఇంకా 15 చెరువులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో విడతలో 407 చెరువులకుగాను 357 చెరువులు పునరుద్ధరించగా ఇంకా 50 చెరువుల్లో పనులు అలాగే ఉన్నాయి. మూడో విడతలో 228 చెరువులకుగాను 144 చెరువుల్లో పూడిక తీయగా 84 చెరువుల్లో పనులు ఆగిపోయాయి. అలాగే నాల్గో విడతలో 96 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 34 చెరువుల్లో పనులు అడపాదడపా చేపట్టి వదిలేశారు. ఇంకా 62 చెరువుల్లో పనులు ప్రారంభిచనూ లేదు.
చెరువుల్లోని మట్టి పక్కదారి
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లోని మట్టిని రైతుల పొలాలకు తరలించాల్సి ఉండగా, వెంచర్లు, ఇటుక బట్టీలకు తరులుతున్నట్లు ఆరోపణలున్నాయి. వెంచర్లలో రోడ్డు వేసేందుకు మట్టిని తరలించినట్లు తెలుస్తోంది. కొత్తగా గృహనిర్మాణాల బేస్‌మెంట్ నింపేందుకు మట్టిని కాంట్రాక్టర్లు అమ్ముకున్నట్లు సమాచారం.