-
-
Home » Telangana » Rangareddy » minister sabithareddy
-
ఎడ్యుకేషన్ హబ్‌గా ‘వికారాబాద్ ’
ABN , First Publish Date - 2020-12-16T04:41:41+05:30 IST
చదువుల కేంద్రంగా విరాజిల్లుతున్న వికారాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

- అన్ని నియోజకవర్గాల్లో నూతన గ్రంథాలయాలు
- త్వరలో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి
- కరోనా వల్ల పరీక్షలు లేకుండా 60 లక్షల మంది విద్యార్థులు ప్రమోట్
- జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి
- విద్య వైద్య, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాముఖ్యత
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్ : చదువుల కేంద్రంగా విరాజిల్లుతున్న వికారాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆవరణలో రూ.కోటి నిధులతో కొత్తగా రీడింగ్ హాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌లోనే జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి విద్య పట్ల ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోందని తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. కొత్తగా నిర్మించతలపెట్టిన రీడింగ్ హాల్‌ను ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దాలని, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. వికారాబాద్‌లో స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రంలో 60లక్షల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశామని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, కొడంగల్ నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యాశాఖలో ఖాళీల వివరాలు ఇవ్వాలని తమకు ఆదేశాలు అందాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోండని మద్దతు ధరలు ఇస్తుంటే.. కేంద్రం మాత్రం ఆదాని, అంబానీలకు మాత్రమే అమ్మాలని చట్టాలు తెస్తోందని ఆమె విమర్శించారు. ఈనెల 27 నుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలకు ప్రత్యేకంగా గ్రంథాలయాల్లో గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతగిరిని పర్యాటకపరంగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.
మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, వికారాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. వికారాబాద్ బ్రిడ్జి సమస్యతో పాటు స్టడీ సర్కిల్ ఏర్పాటు తదితర అంశాలను మంత్రితో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యకు మించిన ఆయుధం మరొకటి లేదని, యువత బాగా చదువుకుని స్థిరపడాలని ఆకాంక్షించారు. పరిగిలో కొత్త గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కొడంగల్ నియోజకవర్గంలో మూడు మండలాల్లో రూ.1.50 కోట్ల నిధులతో కొత్తగా గ్రంథాలయాల భవనాలు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి తన సొంత డబ్బులతో 800మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి 120 మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్, రాష్ట్ర పౌర గ్రంథాలయాల డైరెక్టర్ సీహెచ్.రమణకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, జడ్పీ సీఈవో ఉష, డీఈవో రేణుకాదేవి, మునిసిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేష్, వైస్‌చైర్‌పర్సన్ శంషాద్‌బేగం, ఎంపీపీ చంద్రకళ, గ్రంథాలయ డైరెక్టర్లు బంగ్లా యాదయ్యగౌడ్, మొగులప్ప, కార్యదర్శి శ్రీహరిశంకర్, శుభప్రద్ పటేల్, రమేష్‌కుమార్, ముత్తహార్ షరీఫ్, భూమోళ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.