సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-08T05:06:09+05:30 IST

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్సీ డెవ ల్‌పమెంట్‌ శాఖ పనితీరుపై కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, షెడ్యూల్డ్‌ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి జిల్లాలో అసైన్డ్‌  భూముల అభివృద్ధి పథకాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటగా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన అసైన్డ్‌ భూములను అభివృద్ధి పరిచి వారి ఆర్థిక పరిస్థితులను పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పథకంలో భాగంగా అసైన్డ్‌ భూములను చదును చేయడం, విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించే పనులను ప్రభుత్వం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అసైన్డ్‌ భూములను పొందిన షెడ్యూల్డ్‌ కులాల లబ్ధిదారుల వివరాలు సేకరించి, వారి భూములను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఎస్సీ డెవల్‌పమెంట్‌ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్సీ డెవల్‌మెంట్‌ శాఖ, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విజయానాయక్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-08T05:06:09+05:30 IST