మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలు

ABN , First Publish Date - 2020-12-30T05:15:19+05:30 IST

మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలు

మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

  • ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపట్టాలి
  • ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

(ఆంధ్ర జ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌జిల్లా పరిధిలోని జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. కీసరలో మంగళవారం బీజేపీ రూరల్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు పి.విక్రంరెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జవహర్‌నగర్‌లో జరుగుతోన్న భూకబ్జాలపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్లే భూకబ్జాలు, అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక అధికారులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆరోపించారు. సర్వేనెంబర్‌ 488,495,35లో దాదాపు 700 గజాల ప్రభుత్వ స్థలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్మాణాలు చేపట్టగా, వాటిని స్థానిక తహసీల్దార్‌ గౌతంకుమార్‌ కూల్చివేసి ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టారని తెలిపారు. ఇదే స్థలంలో సీఎంఆర్‌(చామకూర మల్లారెడ్డి) హాస్పిటల్‌ పేరుతో నిర్మాణం ఏ విధంగా జరిగిందని రాంచందర్‌రావు ప్రశ్నించారు. ఆ పక్కనే ఉన్న జవహర్‌నగర్‌  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని నిర్మించి, సీఎంఆర్‌ ఆసుపత్రిలో కలిపారని ఆరోపించారు. జవహర్‌నగర్‌ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్‌ భవనానికి జీప్లస్‌ ఐదంతస్తుల వరకు నిర్మాణ అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోహన్‌రావు కాలనీలో సర్వే నెంబర్‌ 608లో దాదాపు 600 గజాల కమ్యూనిటీ హాలుస్థలం కబ్జా చేశారని, అందులో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. పేదలు ఉంటున్న ఇళ్లకు మునిసిపాలిటీ నుంచి ఇంటి నెంబర్లు ఇచ్చి, మళ్లీ కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ మేడ్చల్‌ నియోజకవర్గం కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డి, కృష్ణాగౌడ్‌, దేశం మల్లే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:15:19+05:30 IST