రైతే దేశానికి వెన్నెముక

ABN , First Publish Date - 2020-11-03T09:51:33+05:30 IST

దేశానికి రైతే వెన్నెముక లాంటివాడని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన

రైతే దేశానికి వెన్నెముక

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


శంకర్‌పల్లి : దేశానికి రైతే వెన్నెముక లాంటివాడని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు బీడీఎల్‌ చౌరస్తా నుంచి మణిగార్డెన్‌ చౌరస్తా వరకు రైతుల ఆధ్వర్యంలో ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు లేకుంటే ప్రపంచమే అతలాకుతలమవుతుందన్నారు. రైతును రాజుగా చూడాలనే ఉద్యేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో రైతువేదికలను కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు.


గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలో నీరు లేక భూములన్నీ ఎడారుల్లా తయాయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చి వ్యవసాయానికి నీరు అందిస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రజలకోసం ఆలోచించే ఒకేఒక్క నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. రైతు కష్టాలు రైతుకే తెలుస్తాయి.. కనుక రైతుల కోసం రెండు విడతలుగా ఎకరానికి రూ.10వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్క కార్యకర్తకు అవకాశం వస్తుందన్నారు. మండలంలోని రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడాలని ఆయన పాలకవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్‌ సాత విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటరాంరెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ నల్లబుచ్చిరెడ్డి, వైస్‌చైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, మహేష్‌చారి, సురేష్‌, శంబారెడ్డి, జగన్‌మౌళి, సురేష్‌, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T09:51:33+05:30 IST