మైనింగ్‌జోన్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస
ABN , First Publish Date - 2020-12-08T04:52:23+05:30 IST
మైనింగ్‌జోన్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

- అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను ఘెరావ్ చేసిన నాయకులు
- మైనింగ్‌జోన్ ఏర్పాటును రద్దు చేయాలని నిరసన
- అర్ధాంతరంగా ముగిసిన సభ
యాచారం : మైనింగ్‌జోన్ ఏర్పాటుపై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాసగా సాగింది. గతంలో రద్దుచేసిన మైనింగ్‌జోన్‌ను మళ్లీ ఎలా ఏర్పాటు చేస్తారని ఆందోళనకారులు అధికారులను ప్రశ్నించడంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. సభ జరగనివ్వండి.. మైనింగ్‌జోన్ ఏర్పాటుపై మాట్లాడండి అని జిల్లా అదనపు కలెక్టర్ ఆందోళన కారులను కోరినా వినిపించుకోలేదు. దీంతో ఆందోళనకారులు అదనపు కలెక్టర్‌ను ఘెరావ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్121లో గల 39ఎకరాలలో మైనింగ్‌జోన్ ఏర్పాటుపై అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కె.రాఘవరెడ్డి, భూగర్భజల అసిస్టెంట్ డైరెక్టర్ జి.మాధుర్య, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి వెంకన్న సోమవారం మైనింగ్‌జోన్ కింద క్రషర్లు బిగించే ప్రదేశంలో మైనింగ్‌జోన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయసేకరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇక్కడ కంకర మిషన్ పెడితే తమ బతుకులు ఏం కావాలని అధికారులను ప్రశ్నించారు. మైనింగ్‌జోన్‌కు బదులు ఇతర కంపెనీలు పెట్టించండి యువతకు ఉపాధి కలుగుతుందని ఎంపీపీ కొప్పు సుకన్యభాషా కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ గతంలో ఇదే ప్రదేశంలో మైనింగ్‌జోన్ ఏర్పాటు చేస్తామంటే ఆప్పటి కలెక్టర్ దానకిషోర్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి రద్దు చేయించామని ఇప్పుడు మళ్లీ ఎలా ఏర్పాటుచేస్తారని అధికారులను నిలదీశారు. ఒక్కో పాయింట్ ప్రకారం మాట్లాడాలని అదనపు కలెక్టర్ కోదండరెడ్డిని ఉద్దేశించి అనడంతో రైతులు, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మైనింగ్‌జోన్ రద్దు చేస్తామని ప్రకటించే దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఎంపీపీ సుకన్య, నాయకులు జి.జంగయ్యగౌడ్, సీపీఎం నాయకులు పి.బ్రహ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.నర్సింహాలతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని యాచారం, మొండిగౌరెల్లి గ్రామాల సర్పంచ్‌లు ఎం.శ్రీధర్‌రెడ్డి, బి.కృష్ణ అదనపు కలెక్టర్‌కు పంచాయతీ తీర్మానంతో పాటు వినతిపత్రాలు అందజేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రతీక్‌జైన్ యాచారం వెళ్లిపోయారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు కార్తీక్, బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుబాషా, బీజేపీ మండల అధ్యక్షుడు టి.రవి, నాయకుడు జి.జంగయ్యగౌడ్, టీడీపీ మండల కన్వీనర్ జోగుకృష్ణ, మొండిగౌరెల్లి ఉపసర్పంచ్ ఎం.యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.