దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణలోనే ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-11-22T04:29:26+05:30 IST

దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణలోనే ఉత్పత్తి
జిన్నింగ్‌ మిల్లును ప్రారంభిస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


వికారాబాద్‌ : దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని వెంకటాపూర్‌ తండాలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప జిన్నింగ్‌ మిల్లును ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్యతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రెండోస్థానంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో మొదటిస్థానానికి చేరుకుంటుందన్నారు. ఈసారి తెలంగాణలో 63లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారని, అధిక వర్షాల వల్ల అక్కడక్కడా పంట దెబ్బతిన్నా, మిగతా అన్ని ప్రాంతాల్లో బాగానే పండిందని తెలిపారు. వర్షాకాలంలో పండే పత్తి పంటను యాసంగిలో సైతం నీరు పెట్టి పండించే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధన సత్ఫలితాలిస్తే యాసంగిలో పత్తి పంట పండించి అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అదేవిధంగా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతువేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం రైతువేదికలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం మిల్లు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కమల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, పాండు, ముత్తహార్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. 


రైతు కుటుంబానికి న్యాయం చేస్తాం..


కేశంపేట : కేశంపేట మండలం వేముల్‌నర్వ గ్రామం సమీపంలోని గాయత్రి జిన్నింగ్‌ మిల్లు వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు బాలయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పరంగా రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అంశాలను పరిశీలించాలని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయికి మంత్రి సూచించారు.

Read more