కాలేజీల్లోనూ మధ్యాహ్నం బువ్వ
ABN , First Publish Date - 2020-07-19T08:46:57+05:30 IST
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆకలి కేకలకు బ్రేక్ పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ...

- ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు
- ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్
- జిల్లాలో 10 వేల మంది విద్యార్థులకు లబ్ధి
పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ కడుపు నిండే కబురు చెప్పారు. ఇకపై ప్రభుత్వ కళాశాలలో చదువుకునే వారికి మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో వికారాబాద్ జిల్లాలో కడుపు మాడ్చుకుని పాఠాలు వినే అనేకమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు.
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆకలి కేకలకు బ్రేక్ పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న సమయంలో ఆకలితో అలమటించిపోయే విద్యార్థులకు ఊరట కలిగించేలా సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు పర్చనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మాదిరిగానే ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలల్లోని ఇంటర్ విద్యార్థులకు, డిగ్రీ, డీఎడ్, బీఎడ్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల కిందట అప్పటి రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, కళాశాల, సాంకేతిక విద్యా శాఖల ఉన్నతాధికారులు సమావేశమై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులు, సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలలతోపాటు ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, డీఎడ్, బీఎడ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపాలు ఉత్పన్నం కాకుండా పులిహోర, బ్లాక్‌రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలతో పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో విద్యార్థులకు ఆకలి కేకలు తీరనున్నాయి.
10 వేల మందికి పైగా ప్రయోజనం
వికారాబాద్ జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ జూనియర్, తొమ్మిది మోడల్ కళాశాలలు, రెండు ప్రభుత్వ, రెండు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్, ఒక ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ (డైట్), ఒక ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఉంది. ప్రభుత్వ జూనియర్, మోడల్, డిగ్రీ, పాలిటెక్నిక్, డైట్ కళాశాలల్లో పది వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఉన్న రెండు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో నాలుగు వేల మంది విద్యార్థుల వరకు ఉంటారు. ఏటేటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచ డానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటన లు చేసినా అమలుకు నోచుకోలేదు. గ్రామాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థుల్లో కొందరు ఇంటి నుంచి బయలు దేరే సమ యంలో ఇంటి నుంచేబాక్సు తీసుకుని వస్తుంటే, తెచ్చుకోని వారు సాయంత్రం వరకు ఆకలితోనే అలమటిస్తున్న విషయం తెలిసిందే.
ఒకవైపు వారిని ఆకలి బాధ పట్టిపీడిస్తుంటే, మరోవైపు తరగతి గదిలో చెప్పే చదువులను వారు సక్రమంగా ఒంట పట్టించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు విద్యార్థులు తమ చదువులను అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురాగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.