దర్జాగా దందా!
ABN , First Publish Date - 2020-12-08T05:24:30+05:30 IST
ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులను ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల అవినీతితో దళారులు దర్జాగా దోచుకుంటున్నారు.

- రోడ్డు పక్కన అక్రమంగా పత్తి కొనుగోళ్లు
- తూకాల్లో మోసం చేస్తూ రైతులను దోచుకుంటున్న దళారులు
- పట్టించుకోని మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులు
వికారాబాద్ : ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులను ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల అవినీతితో దళారులు దర్జాగా దోచుకుంటున్నారు. వికారాబాద్ మార్కెట్ కమిటీలో ఉన్న అవినీతితో నేలను నమ్మిన రైతన్నలు నిండా మోసపోతున్నారు. గతంలో వికారాబాద్ మార్కెట్ పరిధిలో కొందరు దళారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తూకాల్లో భారీగా మోసం చేస్తున్నారన్న విషయం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దృష్టికి పోయింది. మరుసటి రోజే దళారుల వ్యవస్థ లేకుండా చూడాలని మార్కెట్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. లైసెన్సులు కలిగిన వ్యక్తులు మాత్రమే రైతుల వద్ద కొనుగోళ్లు చేయాలని సూచించారు. కావాలంటే మరోసారి సమావేశం నిర్వహించి అర్హత కలిగిన వారికి లైసెన్సులు ఇవ్వాలన్నారు. కానీ సంవత్సరం తిరిగే లోపే మార్కెట్‌లో పాత తంతే కనిపిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పాలకవర్గం చూసీచూడనట్లు వ్యవహరించడంతో మళ్లీ దళారులు రోడ్లపై పాగా వేశారు. మార్కెట్‌లోకి వచ్చే ప్రధాన రహదారుల వెంట దర్జాగా తూకాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తున్నారు. తూకాల్లో మోసం చేస్తూ రైతులను దోచుకుంటున్నారు.
దళారులకు అడ్డే లేదు..
మార్కెట్ అధికారులు, పాలకవర్గం, ప్రజాప్రతినిధుల సహకారంతో దళారులు రోడ్ల పక్కన ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. విషయం తెలిసినా మామూళ్లు అందుతుండటంతో దళారుల దందాకు అడ్డే లేకుండా పోతోంది. మునిసిపల్ కిందిస్థాయి సిబ్బందికి కూడా డబ్బులు అందుతున్నాయి. దీంతో ఆదివారం, సోమవారం, గురువారాల్లో దళారులు అడ్డాలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు.
అడ్డగోలుగా దోచేస్తున్నారు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుకు క్వింటాలకు ధర రూ.5800 అందిస్తుంటే.. వికారాబాద్ మార్కెట్‌లో లైసెన్సులు కలిగిన వ్యాపారులు రూ.5,200 నుంచి 5,400 వరకు అందిస్తున్నారు. అయితే మార్కెట్‌కు పోకుండా రైతులను అడ్డుకుని వారినుంచి రూ.5100కు దళారులు బయటే కొనుగోలు చేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలోకి వచ్చే ఆలంపల్లి, ధన్నారం రోడ్డు, హైదరాబాద్ రోడ్డు సాకేత్‌నగర్ వద్ద దళారులు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను సైతం పక్కన పెట్టి మార్కెట్ పాలకవర్గం సభ్యులు, అధికారులు దళారులను పెంచి పోషిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
తూకాల్లో భారీ మోసాలు
మార్కెట్‌కు ధాన్యం తీసుకురావాలంటే భయం వేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందా మంటే మోసం జరుగుతోంది. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామంటే ఆలస్యం అవుతోందని మార్కెట్‌కువెళ్తే తూకాల్లో మోసం చేస్తున్నారు. వీటిపై అధికారులు శ్రద్ధచూపి చర్యలు తీసుకోవాలి.
- శ్రీనివాస్‌గౌడ్, రైతు, మాలసోమారం
లైసెన్సు లేని కేంద్రాలను మూసేయాలి
లైసెన్సు లేని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయాలి. గతంలో ఆరుబయట పెట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జరిగే మో సాలు బయటపడ్డాయి. ఈ విషయమై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమావేశం నిర్వహించి లైసెన్సు లేనివారు కొనుగోళ్లు జరపొద్దని సూచించినా అధికారుల్లో చలనం లేదు.
- పెద్దగొల్ల నర్సింహులు, రైతు, ధారూరు మండలం
మార్కెట్ ఏరియా వరకే మా బాధ్యత
మార్కెట్ వరకే మా పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టంలో బయట జరిగే వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తూకాల్లో జరిగే మోసం మాకు సంబంధం ఉండదు. కేవలం మేము లైసెన్సు ఉందా లేదా అనేదే చూస్తాం..
- వెంకట్‌రెడ్డి, వికారాబాద్ మార్కెట్ కార్యదర్శి