-
-
Home » Telangana » Rangareddy » MANLESS ROADS
-
రహదారులు నిర్మానుష్యం
ABN , First Publish Date - 2020-03-23T06:08:39+05:30 IST
కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకుయు చేవెళ్ల డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సంపూర్ణంగా...

- -చేవెళ్లలో జనతా కర్ఫ్యూ సంపూర్ణం..
- -స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసిన వ్యాపారులు
- -ఇళ్ల నుంచి బయటకు రాని ప్రజలు
చేవెళ్ల : కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకుయు చేవెళ్ల డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సంపూర్ణంగా ప్రజలు విజయవంతం చేశారు. ఆదివారం జనతాకర్ఫ్యూ సందర్భంగా చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. అన్ని విధాలా స్వచ్ఛందంగా వ్యాపారులు కూడా దుకాణాలను బంద్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.
చేవెళ్ల మండల కేంద్రం మీదుగా ఉన్న హైద్రాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి వాహనాలు, జనాలు లేక ఎక్కడికక్కడ బోసిపోయాయి. గ్రామాల్లోని విధులన్నీ జనాలు లేక వెలవెలబోయాయి. మండల కేంద్రాల్లో ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు మాత్రమే తెరిచారు. అలాగే ఆలయాలు, చర్చిలు, మాసీదులు మూసివేసి ఉన్నాయి. కనీసం ప్రజలు రోడ్లపై రావడానికి కూడా ఇష్టపడలేదు. హోటళ్లు, దాబాలు, టీ దుకాణాలు, పూర్తిగా బంద్ చేశారు. అలాగే బస్టాండ్‌లో బస్సులు, ప్రయాణికులు లేక బోసిపోయింది. గతంలో ఎప్పుడూ రోడ్లు ఇంత ఖాళీగా కనిపించలేదని పలువురు చెప్తున్నారు. ప్రజలు ప్రభుత్వ సూచన మేరకు కర్ఫ్యూను స్వచ్ఛందంగా విజయవంతం చేశారు. చేవెళ్ల పోలీస్‌లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా రోడ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు.
- చప్పట్లతో దద్దరిల్లిన గ్రామాలు
- -వైద్యులకు సంఘీభావం తెలిపిన ప్రజలు
చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ తదితర మండలాల్లోని ప్రజలు ఆదివారం రోజంతా జనతాకర్ఫ్యూను పాటించి సాయంత్రం అన్నివర్గాల ప్రజలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇండ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యుల కు సంఘీభావం తెలిపారు. మరి కొంత మంది ఆలయాల్లో గంటలను మోగించారు. అలాగే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్‌లు రోడ్లపైకి వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం వ్యక్తం చేశారు.
షాబాద్‌లో ..
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆదివారం మండల ప్రజలందరు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనతా కర్ఫ్యూలో భాగంగా ఇండ్లల్లోనే ఉండిపోయారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు జనంలేక వెలవెలబోయాయి. షాబాద్ పోలీసులు బయటకు వచ్చిన వారికి కరోనా వైరస్‌పై కొన్ని సూచనలు చేశారు.
మొయినాబాద్‌లో..
మొయినాబాద్ మండలంలో ప్రజలు దుకాణదారులు జనాతా కర్ఫ్యూ సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్ల మీదకు ఎవరూ రాలేదు. అన్ని వర్గాల ప్రజలు ఇంట్లోనే టీవీలకు అత్తుక్కుపోయారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు జనంలేక వెలవెలబోయాయి. మొయినాబాద్ మండల పోలీసులు బయటకు వచ్చిన వారికి కరోనా వైరస్‌పై కొన్ని సూచనలు చేశారు. గ్రామాల్లో సైతం పోలీస్‌లు పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో..
శంకర్‌పల్లి : ప్రాణాంతకమైన కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఏకమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఇంటిలోనే ఉండిపోయారు. సాయంత్రం 5గంటలకు శంకర్‌పల్లి తహశీల్దార్ కృష్ణకుమార్, మున్సిపాలిటీ కమిషనర్ జైత్రాం నాయక్, సీఐ గోపీనాథ్ తమ సిబ్బందితో కలిసి శంకర్‌పల్లి చౌరస్తాలో చప్పట్లుకొట్టి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది వీధులగుండా బ్లీచింగ్ పౌడర్, క్రిమి సంహారక మందును స్ర్పే చేయగా శంకర్‌పల్లిలో అలాంటి చర్యలేమీ కనిపించలేదు.
సర్దార్‌నగర్ సంత బంద్
షాబాద్ : జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరుగాంచిన సర్దార్‌నగర్ సంత ఈనెల 24న మంగళవారం కరోనా వైరస్ కారణంగా బంద్ గ్రామ సర్పంచ్ మునగపాటి స్వరూపనర్సింహులు, పంచాయితీ కార్యదర్శి చంద్రకాంత్ తెలిపారు. ఆదివారం సర్దార్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... కరోనా వైరస్ కారణంగా మంగళవారం జరిగే సంతను బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
24న షాబాద్ తైబజార్ వేలం
షాబాద్ : ఈ నెల 24న షాబాద్ గ్రామపంచాయితీ కార్యలయం పరిధిలో ఉన్న తైబజార్ వేలం నిర్వహిస్తున్నట్లు షాబాద్ సర్పంచ్ తమ్మలి సుబ్రమణ్యేశ్వరీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... తైబజార్ వేలం పాటలో పాల్గొనేవారు 24న ఉదయం 10.30లోపు గ్రామ పంచాయితీ పేరిట 2వేల రూపాయల డీడీ తీసుకొని తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ వేలం పాట అదే రోజు ఉదయం 11.30 నిమిషాలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.