గండి మైసమ్మకు దండిగా మొక్కులు
ABN , First Publish Date - 2020-12-04T05:06:36+05:30 IST
గండి మైసమ్మకు దండిగా మొక్కులు

- వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- భక్తిశ్రద్ధలతో పెద్ద రథోత్సవం.. తరలివచ్చిన భక్తజనం
కడ్తాల్ : ఆపద మొక్కుల దైవంగా, శక్తి స్వరూపిణి, పేదల ఇలవేల్పుగా వెలుగొందుతున్న కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా, శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మైసమ్మ దేవతను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ వేదపండితుడు కొడగండ్ల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు. అదే విధంగా అమ్మవారికి పలువురు భక్తులు ఒడిబియ్యం పోసి పూజలు చేశారు. వాహన పూజలు, శాక్తేయ మొక్కుబడులు, కొనుగోళ్లతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలిపంతూ, ఈవో స్నేహలత ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ ఆర్.పి.జ్యోతి, సర్పంచ్ తులసీరాం నాయక్, ఉత్సవ నిర్వాహకుడు రామావత్ భాస్కర్ నాయక్, శ్రీనివా్‌సరెడ్డి, పంత్యనాయక్, అమృనాయక్, దశరథ్‌నాయక్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పెద్ద రథోత్సవం
మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద పెద్ద రథోత్సవం కార్యక్రమాన్ని గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. మైసిగండితో పాటు సమీప గ్రామాల ప్రజలు పెద్ద తేరును తిలకించడానికి తరలివచ్చారు. ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఎస్ఐ సుందరయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.