మహాపిరమిడ్‌ ముస్తాబు

ABN , First Publish Date - 2020-12-21T04:13:49+05:30 IST

మహాపిరమిడ్‌ ముస్తాబు

మహాపిరమిడ్‌ ముస్తాబు
ముస్తాబైన మహేశ్వర మహాపిరమిడ్‌

  • నేటి నుంచి ఈనెల 31 వరకు మహిళా డిజిటల్‌ ధ్యాన మహోత్సవాలు 
  • కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు
  • ధ్యాన గురువు పత్రీజీ ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణ 
  • హాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ప్రముఖులు

కడ్తాల్‌ : రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి గాంచిన కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన మహోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు కొనసాగే మహిళాధ్యాన మహాచక్రం-2కు పిరమిడ్‌ స్పిరిచ్యూవల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో ఈ ఏడాది ధ్యానులకు అనుమతించనున్నారు. 11 రోజుల పాటు కొనసాగే ప్రత్యేక మహిళా డిజిటల్‌ ధ్యాన సంబురాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ధ్యానులు, పిరమిడ్‌ మాస్టర్లు, సందర్శకులు, సాధకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు రానున్నారు. ధ్యాన, శాఖాహార జగతే లక్ష్యంగా ప్రతి ఏటా ఇక్కడ ప్రముఖ ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ ఆధ్వర్యంలో ధ్యాన మహోత్సవాలు నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి కూడ వేడుకలకు పిరమిడ్‌ మాస్టర్లు, కళాకారులు హాజరుకానున్నారు. కడ్తాల మండల కేంద్రంలోని అన్మాస్‌పల్లి రోడ్డులో  శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసరించి పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, పిరమిడ్‌ వరకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులు, సందర్శకులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకలు కొనసాగుతాయి. ఉదయం బ్రహ్మర్షి పత్రీజీ వేణునాథ సంగీత ధ్యానంతో ధ్యాన సభలు ప్రారంభమవుతాయి. కాగా కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఏడాది డిజిటల్‌ ద్వారా ధ్యాన మాస్టర్ల సందేశాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇప్పటికే పిరమిడ్‌లోని సరస్వతి ప్రాంగణంలో ధ్యాన వేదిక, చలికి తట్టుకునేలా ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 5గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్ది నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ధ్యాన గురువు పత్రీజీ, ఆయన సతీమణి స్వర్ణమాల పత్రీజీలు ఉత్సవాలను ప్రారంభిస్తారని పిరమిడ్‌ ట్రస్టీ వైస్‌చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, పీఎ్‌సఎస్‌ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఆర్‌.ప్రేమయ్య, పీఆర్‌వో రవిశాస్త్రీ తెలిపారు. ఆ తర్వాత పత్రీజీ ధ్యానుల ఉద్దేశించి మాట్లాడుతారని వారు పేర్కొన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో 12 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వారికి మహాసభలకు అనుమతి లేదన్నారు. మహాసభలకు విచ్చేసే వారికి పాస్‌లు జారీ చేశామని, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని వారు తెలిపారు.

Updated Date - 2020-12-21T04:13:49+05:30 IST