నిర్లక్ష్యానికి నిలువుటద్దం
ABN , First Publish Date - 2020-09-20T09:39:06+05:30 IST
అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంసీపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

ఉద్దెమర్రి పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న అభివృద్ధి
నత్తనడకన అభివృద్ధి పనులు
డీపీవో ఆదేశాలు భేఖాతర్
చోద్యం చూస్తున్న అధికారులు
శామీర్‌పేట రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పూర్తి చేయడంలో అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంసీపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా పంచాయతీరాజ్ అధికారి డీపీవో గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి వారం రోజుల్లో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించినా ‘‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ..’’ అన్న చందంగా పరిసిల్థతి ఉంది. గ్రామంలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు, శిథిలావస్థకు చేరిన ఇండ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు దోమలు విజృ భించి జ్వరాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా వైర్‌సతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులతో సతమతం అవుతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. హరితహారం మొక్కలు పిచ్చి మొక్కలతో కలిసిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపై పారుతూ కనిపిస్తోంది. రాత్రి అయిందటే వీధిదీపాలు వెలగడం లేదు. ఇన్ని సమస్యలు తాండవిస్తున్నా పంచాయతీ పాలకవర్గం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నత్తనడకన అభివృద్ధి పనులు
కాగా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన డంపింగ్‌యార్డు, వైకుంఠదామం, పల్లె ప్రకృతివనాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డీపీవో పద్మజారాణి ఆదేశించినా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పిల్లర్ల వరకే వైకుంఠదామం స్నానాల గదులు, డంపింగ్‌యార్డు పనులు కొంత మేర పూర్తయ్యాయి. వైకుంఠదామం బర్నింగ్ షెడ్ల ఊసేలేదు. పల్లె ప్రకృతివనాల కొరకు స్ధలం సేకరించలేదు. దీంతో పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల జాప్యంతోనే సమస్యలు
- ఆంజనేయులు, గ్రామస్థుడు, ఉద్దెమర్రి
నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో కనీస మౌలికవసతులను కల్పించడం లేదు. పంచాయతీ పాలకవర్గానికి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. శ్మశానవాటిక ఏర్పాటు, పల్లె ప్రకృతివనానికి స్థలం గుర్తించడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారు. గ్రామంలో వీధిదీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టడం లేదు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చడంలేదు. దీంతో ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.