అసైన్డ్‌భూమిలో అక్రమ లేఅవుట్‌

ABN , First Publish Date - 2020-11-27T05:11:51+05:30 IST

అసైన్డ్‌భూమిలో అక్రమ లేఅవుట్‌

అసైన్డ్‌భూమిలో అక్రమ లేఅవుట్‌
దమ్మాయిగూడ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ లేఅవుట్‌

  • స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకున్న అధికారులు

కీసర రూరల్‌: దమ్మాయిగూడ మున్సిపాలిటీ రెవెన్యూ సర్వేనంబర్‌ 530, 530/1,2,3లోని అసైన్డ్‌ భూమిలో లేఅవుట్‌ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. సాగు చేసుకునేందుకు దాదాపు రెండెకరాల స్థలాన్ని ప్రభుత్వం రైతులకు అప్పజెప్పింది. కాగా ఈ స్థలంలో లేఅవుట్‌ చేసేందుకు రియల్‌ వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. పురాతన లేఅవుట్‌గా తలపించేలా చిన్నచిన్న రాళ్లతో హద్దులు ఏర్పాటు చేశారు. దీనికి తోడు తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టారు. రాత్రికి రాత్రే లేఅవుట్‌ ఏర్పాటు కావటం, నిర్మాణాలు ప్రత్యక్షమవటంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఆ లేఅవుట్‌ ఏర్పాటును అడ్డుకుని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్‌ స్థలంలో అక్రమంగా లేఅవుట్‌ ఏర్పాటవుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ నిబంధనల మేరకు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, దమ్మాయిగూడలో వైకుంఠధామం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు దాసరి నర్సింహారెడ్డి, కౌన్సిలర్‌ వరగంటి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-27T05:11:51+05:30 IST