నత్తనడకన ‘నక్ష ’

ABN , First Publish Date - 2020-05-18T10:57:28+05:30 IST

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టు ఉంది.. సీఎం దత్తత గ్రామ దుస్థితి..

నత్తనడకన ‘నక్ష ’

సీఎం దత్తత గ్రామంలో సంక్షేమ పథకాలకు నోచని రైతులు

ఆన్‌లైన్‌లో నమోదు కాని రైతుల వివరాలు

పట్టించుకోని సంబందిత అధికారులు.. 


శామీర్‌పేట రూరల్‌ : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టు ఉంది.. సీఎం దత్తత గ్రామ దుస్థితి.. నాలుగేళ్ల క్రితం గ్రామాన్ని దత్తత తీసుకుని నక్ష తయారు చేయాలని సర్వే అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సర్వే పూర్తి కాకపోవడంతో రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో కేసీఆర్‌ 2016లో స్వయంగా గ్రామసభ పెట్టి వరాల జల్లు కురిపించారు.


గ్రామానికి నక్ష లేదని రైతులు సీఎం దృష్టికి తేవడంతో తక్షణమే సర్వే చేపట్టి నూతన నక్షను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు నక్ష పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎదురైన అధికారికెల్లా విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. వచ్చిన ప్రతి అధికారి నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడమే గాని ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదు. దీంతో మా గ్రామానికి నక్ష ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.


ఆన్‌లైన్‌లో నమోదు కాని ఖాతాదారుల వివరాలు

కాగా లక్ష్మాపూర్‌ రెవెన్యూ విస్తీర్ణం సుమారు 4,497 ఎకరాలు ఉన్నది. సుమారు 940 ఖాతాదారులు ఉన్నారు. కాగా ఇందులో 280 ఖాతాలు ఆన్‌లైన్‌(ధరణి)లో నమోదయ్యాయి. 170 మంది ఖాతాదారులు చనిపోవడంతో వాటిని నమోదు చేయలేదు. మిగతావారు ఆధార్‌కార్డులు ఇవ్వనివారు ఉన్నారు. రైతుల భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో రైతుబంధు, రైతుబీమాలకు అనర్హులుగా మిగులుతున్నారు. నక్ష పూర్తి చేయాలంటే ఆన్‌లైన్‌లో ఖాతాదారులు పేర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు వివరాలను నమోదు చేయడంలో అఽధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రైతుబంధు ఊసేలేదు

కాగా లక్ష్మాపూర్‌ రైతులకు రబీ సాగుకు రైతుబంధు అందలేదు. మొదటి విడతలో 581 మందికి చెక్కులు అందజేశారు. కాగా ముగిసిన రబీ కాలానికిగాను ఇప్పటివరకు రైతులకు రైతుబంధు అందలేదు. కారణం రైతుల ఖాతాలు ధరణిలో నమోదు కాకపోవడమే. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. సీఎం దత్తత గ్రామానికే రైతుబంధు అందకపోతే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను నక్షతో ముడిపెట్టడంతో వ్యవసాయం చేయాలా.. వద్దా.. అనే సందిగ్ధంలో రైతులు పడిపోయారు.


రైతుబీమా కోల్పోయాం..రాజమణి, మహిళా రైతు, లక్ష్మాపూర్‌

ప్రభుత్వం ప్రకటించిన రైతుబీమా మాకు అందలేదు. నా భర్త కటికెల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెం దాడు. మాకు 1026 పట్టాలో ఎకరం భూమి ఉంది. రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నాం. దరణిలో  ఖతాదారుడి పేరు నమోదు కాలేదని రైతుబీమాకు అనర్హులని చెప్పారు. మాది నిరుపేద కుటుంబం ప్రభుత్వం ఏలాగైన మాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాను. 


లాక్‌డౌన్‌ తర్వాతే నక్ష పూర్తిచేస్తాం..గోవర్దన్‌, శామీర్‌పేట తహసీల్దార్‌ 

రైతుల ఖాతాల వివరాలను ఆన్‌ లైన్‌లో నమోదు చేస్తున్నాం. కొందరు తమకు ఏలాంటి భూములు లేకున్నా పహాణిలో రాయించుకున్నారని వాటిని పాత పహాణి ప్రకారం రికార్డులను పరిశీలించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫారెస్ట్‌ భూములపై సర్వే కొనసాగుతోంది. రైతుబంధు పథకం కొరకు పాత రికార్డు ప్రకారం రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపించాం. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాతనే నక్ష పూర్తి చేస్తాం. 


Updated Date - 2020-05-18T10:57:28+05:30 IST