ముగిసిన కార్తీకమాసోత్సవం

ABN , First Publish Date - 2020-12-15T05:50:56+05:30 IST

ముగిసిన కార్తీకమాసోత్సవం

ముగిసిన కార్తీకమాసోత్సవం
అదనపు కలెక్టర్‌కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయచైర్మన్‌

  • అన్నాభిషేకం, తైలాభిషేకంతో ముగిసిన పూజలు 
  • స్వామివారి సేవల్లో ప్రముఖులు  
  • చీర్యాల్‌ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌ 


కీసర/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌/శామీర్‌పేట: కీసరగుట్ట ఆలయంలో కార్తీకమాసోత్సవం ముగిసింది. చివరి రోజు సోమవారం అమావాస్య కలిసి రావడంతో భక్తులు విశేషంగా భావించారు. ఈ సందర్భంగా ఉదయం గర్భాలయంలోని మూలవిరాట్‌కు రుద్రాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం తైలాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించి ఉత్సవాలను ముగించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ స్వామివారి దర్శనానికి రాగా ఆలయ చైర్మన్‌ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్థ మండపంలో స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామివారి తీర్థ ప్రసాదములు, శేషవస్త్రములు, ఆశీర్వచనాలు అందజేశారు. మాల్కాజ్‌గిరి కోర్టు అదనపు న్యాయమూర్తి భవాని చంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక  పూజలు నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీలోని పోచారంలో గల సర్వమంగళా సమేత స్పటిక లింగేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   ఘట్‌కేసర్‌ మండలం అవుశాపూర్‌లో ఉమామహేశ్వర ఆలయం, అంకుశాపూర్‌లోని భవాని శంకర శివపంచా యతన స్వటికలింగేశ్వర స్వామి ఆలయం, ఎదులాబాద్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆవాలయం, కొర్రెములలోని శివాలయం, ప్రతాప సింగారంలోని శ్రీ భవాని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఎదులాబాద్‌లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకరప్ప, చెన్నప్ప, నరేష్‌, ఓం ప్రకాష్‌, ప్రదీప్‌, ధర్మారెడ్డి, విశ్వనాథం, అయిలయ్య,  శ్రీనివా్‌సయాదవ్‌, రాజేష్‌, సావల్‌ వినోద్‌, రాంనాథ్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన ప్రత్యేక అభిషేకం, వనభోజనాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త ధాత్రిక కాశీనాథ్‌ తెలిపారు.   శామీర్‌పేటలోని శ్రీభవానిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మురళీధరశర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం, గోత్రనామాలతో అర్చన, అభిషేకాలు, మంత్ర పుష్పం, తీర్థప్రసాదాలు వితరణ చేశారు. తూంకుంట పరిధిలోని శ్రీగాయత్రీ మహాక్షేత్రంలో ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎన్‌వీఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో ఉమామహేశ్వరస్వామికి పూజలు చేశారు.

Updated Date - 2020-12-15T05:50:56+05:30 IST