కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-11-28T05:27:35+05:30 IST

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
యాచారం : కేంద్రీయ మెట్టవ్యవసాయ పరిశోధన కేంద్రం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తూ వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కానుగుల వెంకటయ్య, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య, డీవైఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు పిప్పల్ల శివశంకర్‌ ఆరోపించారు. ఆమనగల్లులో శుక్రవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక మార్కెట్‌ యార్డు నుంచి పోస్టాఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలుచేశారు. అనంతరం బస్టాండ్‌ కూడలిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల, సంపన్నుల కొమ్ముకాస్తూ పేదల, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎల్‌ఐసీ, రైల్వే, బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని వెంకటయ్య, చెన్నయ్య, శివశంకర్‌ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని వాటిని వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు దైవానందం, చెన్నయ్య, డి.పోశయ్య, హంసమ్మ, దశరథం, పద్మ, రాములు, శ్రీను నాయక్‌, యాదమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎదుట ధర్నా


యాచారం :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.మధుసూదన్‌రెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య విమర్శించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో సీపీఎం, ప్రజాసంఘాల కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక్కడ కూలీలకు వేతనాలు పెంచడంలో శాస్త్రవేత్తలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కార్మికులకు బీమా వర్తింపజేయడంతో పాటు ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు  ఆలంపల్లి నర్సింహ, వినోద్‌కుమార్‌, థావ్‌నాయక్‌, భాషయ్య,  చందూనాయక్‌, జంగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T05:27:35+05:30 IST