తెల్లజొన్నకు లద్దెపురుగు బెడద

ABN , First Publish Date - 2020-12-06T04:51:20+05:30 IST

తెల్లజొన్నకు లద్దెపురుగు బెడద

తెల్లజొన్నకు లద్దెపురుగు బెడద
ల్యానాయక్‌తండాలో తెల్లజొన్న చేను

మొక్కదశలోనే వ్యాప్తి 

దిగుబడిపై ప్రభావం తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం 

లబోదిబోమంటున్న రైతులు

బషీరాబాద్‌: తెల్లజొన్నకు మొక్క దశలోనే లద్దెపురుగు వ్యాప్తి చెందడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఓ పక్క భారీ వర్షాలతో పత్తి చేలు దెబ్బతినగా, మరో పక్క  తెల్లజొన్నకు కత్తెర పురుగు ఆశించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బషీరాబాద్‌ మండలంలో యాసంగి సీజన్‌లో 630 ఎకరాల్లో  తెల్లజొన్న సాగు చేశారు. మొలక దశలోనే పురుగులు వ్యాప్తి చెంది ఆకులను తొలుస్తూ తింటున్నాయి. మొక్క సుడుల్లో పురుగులు కాండాలను తిని ఆకులకు రంధ్రాలు పెడుతుండటంతో రైతులకు కునుకులేకుండా పోయింది. పర్వత్‌పల్లి, దామర్‌చెడ్‌, వాల్యానాయక్‌ తండా, నీళ్లపల్లి తదితర గ్రామాల పరిధిలోని జొన్న చేలల్లో లద్దెపురుగు వ్యాప్తి రోజురోజుకూ పెరగడంతో రైతులు ఆందోళన  చెందుతున్నారు. పంట సస్యరక్షణకు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయమై ఏఈవో రఘువంశీని అడుగగా తెల్లజొన్న పంటకు లద్దె పురుగు వ్యాపించిందన్నారు. ఈ పురుగు నివారణకు రైతులు 3జీ గుళికలను మొక్క సుడుల్లో వేయాలన్నారు. ఐదు రోజుల్లో పురుగు ఉధృతి తగ్గకుంటే ఫ్లోక్లెన్‌ మందును పంటపై పిచికారీ చేస్తే పురుగుల బెడద నుంచి జొన్నపంటను రక్షించుకోవచ్చని ఆయన సూచించారు.

ఏడెకరాల్లో జొన్న పంటకు నష్టం

ఏడెకరాల్లో జొన్న పంట సాగుచేశాను. ఆశాజనకంగానే మొలకెత్తింది. 20 రోజుల తర్వాత  మొక్కల సుడుల్లో కాండాలను పురుగులు తొలిచి తింటున్నాయి. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాం. అధికారులు క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలి

 - రాథోడ్‌రాజు, వాల్యానాయక్‌తండా 

Updated Date - 2020-12-06T04:51:20+05:30 IST