మళ్లీ కురిసిన వర్షం

ABN , First Publish Date - 2020-08-20T10:03:24+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో ఐదురోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం.. ఒకరోజు విరామం తరువాత మళ్లీ కురిసింది.

మళ్లీ కురిసిన వర్షం

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో ఐదురోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం.. ఒకరోజు విరామం తరువాత మళ్లీ కురిసింది. మంగళవారం అక్కడక్కడ చిరుజల్లులు కురియగా, రాత్రి ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం తరువాత పరిగి, వికారాబాద్‌, తాండూరులో ఓ మోస్తరు వర్షం కురియగా, కొడంగల్‌లో చిరుజల్లులు కురిశాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలో అత్యధికంగా బంట్వారం మండలంలో 30.8 మి.మీ. వర్షం కురియగా, యాలాల్‌లో 30.4 మి.మీ., పెద్దేముల్‌లో 26.2 మి.మీ., తాండూరులో 24.2 మి.మీ., బషీరాబాద్‌లో 23.8 మి.మీ., ధారూరులో 22.6 మి.మీ. వర్షం కురిసింది. కోట్‌పల్లి మండలంలో 19.8 మి.మీ., వికారాబాద్‌లో 18.4 మి.మీ, బొంరాస్‌పేటలో 16.0 మి.మీ., మర్పల్లిలో 15.8 మి.మీ., దోమలో 15.0 మి.మీ., పూడూరులో 14.4 మి.మీ., కులకచర్లలో 13.6 మి.మీ., మోమిన్‌పేటలో 13.0 మి.మీ., పరిగిలో 12.4 మి.మీ., నవాబుపేటలో 10.8 మి.మీ., కొడంగల్‌లో 8.2 మి.మీ., దౌల్తాబాద్‌లో 8.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


దెబ్బతిన్న పెసర పంట

తాండూరు రూరల్‌ : ప్రస్తుత వర్షాలకు పెసర పంట తీవ్రంగా దెబ్బతిన్నది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురిసి నిండా ముంచింది. పెసర కాయలు చెట్లపైనే మొలకలు రావడంతో తీవ్ర నష్టం వచ్చింది. తాండూరు మండల పరిధిలోని అంతారం, అంతారం తండా, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌, సిరిగిరిపేట్‌, రాంపూర్‌మీదితండా, కింది తండా, బెల్కటూర్‌, మిట్టబాస్పల్లి, చెంగోల్‌, పర్వతాపూర్‌, చింతామణిపట్నం తదితర గ్రామాల్లో 2.586 మంది రైతులు 6347 ఎకరాల్లో పెసర పంటను సాగు చేశారు. ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో 300 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-08-20T10:03:24+05:30 IST