ఎత్తు పెంచండి మహాప్రభో..కల్వర్టు ఎత్తు పెంచాలని రైతుల వేడుకోలు

ABN , First Publish Date - 2020-09-16T05:48:29+05:30 IST

సీఎం ప్రత్యేక నిధులతో మత్తడి సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు ఎత్తు పెంచాలని రైతులు, గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నా సంబంధిత అధికారులు

ఎత్తు పెంచండి మహాప్రభో..కల్వర్టు ఎత్తు పెంచాలని రైతుల వేడుకోలు

లక్ష్మాపూర్‌ పెద్దచెరువు ఆయకట్టు కింద 330ఎకరాల్లో సాగుభూములు  

పర్యాటక కేంద్రంగా మారుస్తామని  గ్రామసభలో సీఎం వెల్లడి 

పట్టించుకోని అధికారులు


శామీర్‌పేట రూరల్‌: సీఎం ప్రత్యేక నిధులతో మత్తడి సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు ఎత్తు పెంచాలని రైతులు, గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శామీర్‌పేట మండలంలో రెండో పెద్ద చెరువుగా ప్రసిద్ది గాంచిన చెరువు కల్వర్టును అధికారులు ఇష్టానుసారంగా  నిర్మిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈచెరువు సుమారుగా 90 ఎకరాల విస్తీర్ణంతో కూడుకుని ఉంది. కాగా సీఎం దత్తత గ్రామంలో కల్వర్టు నిర్మాణం కొరకు రూ.49.5లక్షల ప్రత్యేక నిధులను కేటాయించి కల్వర్టు నిర్మాణం చేపట్టారు. కాగా ప్రస్తుతం కల్వర్టు ఎత్తు మూడు మీటర్ల వరకు స్లాబ్‌ వేశారు. కాగా చెరువు ఆయకట్టు కింద 330 ఎకరాల్లో భూములు సాగు చేస్తున్న రైతులు ఈ కల్వర్టు ఎత్తును మరొక్క మీటరు వరకు పెంచాలని కోరుతున్నారు.


దీని ద్వారా చెరువు నుంచి వచ్చే వరద ఉధృతికి వీలుగా నీళ్లు కల్వర్టు కింద నుంచి వెళ్తాయని రైతులు చెబుతున్నారు. మత్తడి నుంచి వచ్చే నీటి ఉధృతికి మత్తడిపై నడవలేకపోతున్నామని, పశువులు సైతం నీళ్లలో కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. చెరువుకు ఆనుకుని ఉన్న సీసీ రోడ్డుకు సమాంతరంగా కల్వర్టును నిర్మిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు ఇరిగేషన్‌ అధికారులకు మొరపెట్టుకున్నారు. అలాగే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.


ఇబ్బందులు తలెత్తకుండా నిర్మించాలి

ఉమ్మడి శామీర్‌పేట మండలంలోనే రెండో పెద్ద చెరువుగా లక్ష్మాపూర్‌ చెరువు ప్రసిద్ధి చెందింది. ఈ చెరువు దాదాపుగా 90ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రభుత్వం మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులో భారీగా మట్టితీతలు చేశారు. దీంతో చెరువు లోతు కూడా పెరిగింది. ప్రతి వర్షాకాలంలో చెరువు నిండి అలుగు పారుతోంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కల్వర్టు ఎత్తు పెంచాలి.

- తోట పరమేష్‌, వార్డు సభ్యులు, యువరైతు లక్ష్మాపూర్‌


మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చుతామని సీఎం హామీ..

సీఎం కేసీఆర్‌ మా గ్రామ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. చెరువు కట్టపై వెళ్లడానికి కల్వర్టును పెంచాలని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదు. మాచెరువు కట్టపై సీఎం దావత్‌ చేసుకుందామని చెప్పిండ్రు. రైతుల కోరిక మేరకు అధికారులు స్పందించి కల్వర్టు ఎత్తు పెంచడానికి చర్యలు తీసుకోవాలి.             

- దశరథ, లక్ష్మాపూర్‌ రైతు

Updated Date - 2020-09-16T05:48:29+05:30 IST