ఆశాజనకంగా వానాకాలం సాగు

ABN , First Publish Date - 2020-09-24T06:30:06+05:30 IST

ఈ ఏడాది వానాకాలం పంటల సాగు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆశాజనకంగా ఉంది. వరుసగా నాలుగేళ్లు కరువు కారణంగా

ఆశాజనకంగా వానాకాలం సాగు

గతేడాదితో పోల్చితే గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం


ఇబ్రహీంపట్నం: ఈ ఏడాది వానాకాలం పంటల సాగు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో  ఆశాజనకంగా ఉంది. వరుసగా నాలుగేళ్లు కరువు కారణంగా వేసిన పం టలు చేతికందక రైతులు నష్టాలను చవిచూడగా, ఈ ఏడాది పంటలపై గంపెడాశలతో ఉన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల కింద వరి, కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగింది. నియోజకవర్గంలో గత వానాకాలంలో 33,141 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఈ ఏడాది 49,377 ఎకరాల్లో సాగు చేశారు. 16,236 ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయి. నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా  మొక్కజొన్న సాగును గణనీయంగా తగ్గించిన రైతులు పత్తి, వరి, జొన్న, కందితోపాటు కూరగాయల సాగును పెంచారు.


గతేడాది వానాకాలంలో 6,472 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా ఈసారి కేవలం 153 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. పత్తి గతేడాది 9,298 ఎకరాల్లో సాగుచేయగా ప్రస్తుతం 20,228 ఎకరాల్లో సాగైంది. వరి గతేడాది 6,676 ఎకరాలు, ఈ ఏడాది 12,909 ఎకరాలు, జొన్న గతేడాది 4,565 ఎకరాలు, ఈ ఏడాది 8,084 ఎకరాలకు సెరిగింది. కంది గతేడాది 3,719 ఎకరాల్లో సాగుచేయగా ఈ ఏడాది 5,858 ఎకరాల్లో వేశారు. జొన్న, సజ్జ పంట కోతలు చేస్తున్నారు. వరి పొట్ట దశలో ఉంది. పలుచోట్ల కత్తెర పంట గింజ పడుతుంది. పత్తికి వాతావరణం అనుకూలించిందని చెప్పవచ్చు. 

Updated Date - 2020-09-24T06:30:06+05:30 IST