గుట్టుగా గుట్కా!

ABN , First Publish Date - 2020-09-12T09:56:42+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో గుట్కా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు ఈ వ్యాపారం చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

గుట్టుగా గుట్కా!

జోరుగా అక్రమ దందా..

రాష్ట్ర సరిహదుల్లో స్థావరాలు 

పరిగి మీదుగా రాష్ట్ర రాజధానికి రవాణా..

లక్షల్లో వ్యాపారం.. పట్టించుకోని అధికారులు


పరిగి: వికారాబాద్‌ జిల్లాలో గుట్కా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు ఈ వ్యాపారం చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిషేధం అనంతరం కొంతకాలం గుట్టుగా సాగిన గుట్కావ్యాపారం.. మళ్లీ జొరందుకుంది. ఏడాదికాలంలో జిల్లాలోని పరిగి, కొడంగల్‌, తాండూరులలో భారీగా గుట్కాలను పట్టుకున్న సంగతి విధితమే. గతంలో పరిగిలో పట్టుబడిన గుట్కాలను కిందిస్థాయిలో వదిలేయాలనుకున్నా పోలీస్‌ ఉన్నతస్థాయి అధికారులకు తెలియడంతో కేసు నమోదు చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దొరికితే దొంగ... లేదంటే దొర.. అన్న చందగా గుట్కాల వ్యాపారం సాగుతోంది. నిషేధిక గుట్కాల తయారీ, రవాణాకు తెలంగాణ-కర్నాటక సరిహద్దులోని వ్యవసాయక్షేత్రాలు, వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూరు శివార్లలో రహస్య స్థావరాలు వ్యాపారలావాదేవీలకు అడ్డాలుగా మారాయి. పరిగి మీదుగా తరలివెళ్తున గుట్కా వాహనాలు గతంలో మొయినాబాద్‌ పీఎస్‌ పరిధిలో పట్టుబడ్డాయి.


కొంతకాలం క్రితం కొడంగల్‌, పరిగి సర్కిళ్ళ పరిధిలో గుట్టుగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వాహనాలను కిందిస్థాయి పోలీసుల తనిఖీలో పట్టుబడగా, చేతులు తడుపుకుని వదిలేసినట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిషేధిత గుట్కా వ్యాపారం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతోంది. కొందరు రాత్రి వేళల్లో ఏజెంట్ల ద్వారా చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజారోగ్యమే పరమావధి అంటూ.. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, జర్థా మాఫియా మళ్లీ పుంజుకుంటున్నది. పోలీసులు, ఆహార నియంత్రణ అధీకృత విభాగం అధికారుల నిఘా కొరవడడంతో రోజూ లక్షలరూపాయల అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుట్కాసురులు కర్నాటకలోని సేడెం, గుల్బార్గా, గుర్మీట్‌కల్‌ ప్రాంతాలతోపాటు, జిల్లాలోని తాండూరు కొడంగల్‌, పరిగి ప్రాంతాల్లో గుట్కా ప్యాకెట్లను నిల్వ చేస్తారు.


ఈ నిషేధిత గుట్కా నిల్వలు చేసే స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సంబంధిత శాఖ అధికారులకు తెలుసనేది బహిరంగ రహస్యమే. వాటిపై దాడులు చేయాల్సింది పోయి.. నిషేధిత గుట్కా సరఫరానా..? ఎక్కడి నుంచి వస్తోంది... ఎలా జరుగుతుందని అమాయక ప్రశ్నలను సంధిస్తుంటారు. కంటితుడుపు చర్యగా దాడులు జరిపి, గోరంతను కొండతగా చూపిస్తూ అధికారగణం స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలం నుంచి పరిగిలో కూడా గుట్కా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి నగరానికి కూడా తరలిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


శివారులోనే తయారీ..

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులే స్థావరంగా తయారీ, నిల్వ కేంద్రాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని గుల్బార్గా, గుర్మిట్‌కల్‌, సేడెం, మల్కేడ్‌, బీదర్‌ తదితర ప్రాంతాల సరిహద్దు ల్లోని వ్యవసాయ కేంద్రాల్లో తయారీ, నిల్వ స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ ప్రాంతాలకు చెందిన కొందరు సిండికేట్‌గా శివారులోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. గుట్కాల తయారీ, నిల్వ ఉంచే స్థావరాలనుంచి అక్రమార్కులు ఏర్పాటు చేసుకునే ఏజెంట్ల సాయంతో రాత్రి వేళల్లో బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు.


లక్షలాది రూపాయల అక్రమార్జన

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, కొడంగల్‌, తాండూరు,వికారాబాద్‌లతోపాటు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు గుట్కా, జర్థాల సరఫరాతో లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఈ తరహాలో రోజుకు రూ.10 లక్షల అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం. తాండూరు, కొడంగల్‌, పరిగిలతోపాటు, హైదరాబాద్‌ శివారులోని కొన్ని ప్రాంతాల్లో 100 వరకు హోల్‌సేల్‌ కేంద్రాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో గుట్కా వ్యా పార కేంద్రంలో నిత్యం కనీసం రూ.10 నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో రోజుకూ జిల్లా మీదుగా రవాణా అవుతున్న గుట్కా వ్యాపారం ద్వారా రూ.10 లక్షలకు పైగా జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


పాన్‌షాపులు, కిరాణ షాపుల్లో దాచి అమ్మకాలు జరుపుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారయంత్రాంగం జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏజెంట్లు కమీషన్‌లు కొట్టేస్తున్నారు. ఇక వాటిని కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నది మాత్రం సామాన్య జనం. ఈ తరుణంలో నిషేధిత గుట్కా జర్ధా దందాపై ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.

Updated Date - 2020-09-12T09:56:42+05:30 IST