57.93 లక్షలు హరితహారంలో నాటే మొక్కల లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-23T09:40:42+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఆరోవిడత హరితహారం నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి 57.93

57.93 లక్షలు  హరితహారంలో నాటే మొక్కల లక్ష్యం

నర్సరీలో మొక్కలు సిద్ధం

ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు 

మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

ఈనెల 25 నుంచి హరితహారం ప్రారంభం


రంగారెడ్డి జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అడపాదడప వర్షాలు పడుతుండటంతో ఈ నెల 25 నుంచి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 560 గ్రామపంచాయతీల్లో పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 57.93 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.  ఇందులోభాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి పంపిణీకి సిద్ధంగా ఉంచారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఆరోవిడత హరితహారం నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి 57.93 లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులోభాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఈనెల 25 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇళ్లలో, ఇంటి పెరటిలో నాటుకునే దానిమ్మ, జామ, నేరేడు, తులసి, గోరింటాకు, గులాబీ, గన్నేరు, మునగ తదితర మొక్కలను నర్సరీల నుంచి ప్రజలు తీసుకెళ్తున్నారు. 


తెలంగాణలో అడవుల విస్తీర్ణం పెంచడానికి సీఎం కేసీఆర్‌ 2015లో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి ప్రారంభించారు. ప్రతిఏటా హరితహారం అబాసుపాలవుతోంది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ప్రభు త్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఏటా మొక్కలు నాటినట్లు అధికారులు కాకి లెక్కలు చూపిస్తున్నారు. మొక్కలు నాటడమే కానీ.. పరిరక్షించడం పట్ల నిర్లక్ష్యం వహించడంతో చాలావరకు మొక్కలు బతక లేదు. ఈసారి లోటుపాట్లకు తావులేకుండా నాటిన మొక్కను కాపాడేం దుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈజీఎస్‌ ద్వారా జిల్లాలో 560 గ్రామపంచాయతీల్లో పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేశారు. వీటిలో 34.31 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గతేడాది పెంచిన మొక్కల్లో 23.93 లక్షల వరకు నర్సరీల్లో మిగిలి ఉన్నాయి. మొత్తం 57.93 లక్షల మొక్కలను ఈ ఏడాది నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.


జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మూడు కార్పొరేషన్లు, 12మున్సిపాలిటీల్లో 9.60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రహదారుల వెంట, ఆవాస ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మొక్కలు నాటేందుకు కసరత్తు చేస్తున్నారు. వేప, చింత, కానుగ, టేకు, దానిమ్మ, జామ, నేరేడు, తులసి, గోరింటాకు, గులాబీ, గన్నేరు, మునగ తదితర మొక్కలు నాటేందుకు సుమారు 5లక్షల వరకు గుంతలను తవ్వి సిద్ధం చేశారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలో సుమారు 20 నర్సరీల్లో పది లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిని 450 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అర్బన్‌ పార్కులు, అటవీ భూముల్లో నాటాలని నిర్ణయించారు. అటవీ జంతువులకు ఆహారంగా ఉపయోగపడే మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జామ, అల్లనేరేడు, సీతాఫలం, మారేడు, పనస, సీమ చింత, చింత, ఉసిరి, రావి, మర్రి, మేడి, వెలగ తదితర మొక్కలు నాటనున్నారు. 


నాటిన మొక్కలకు ఫైబర్‌ ట్రీ గార్డులు

మొక్కల సంరక్షణకు ఈసారి ఫైబర్‌ ట్రీగార్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.160 ఖర్చు పెడుతున్నారు. రహదారుల వెంట ఇతర ప్రాంతాల్లో చింత వనాలను విరివిగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల వెంట గుల్‌మోహర్‌, పగోడా మొక్కలను ఒకే వరుసలో కాకుండా రెండు మూడు వరుసల్లో నాటనున్నారు. ప్రతి మున్సిపాలిటీతోపాటు జిల్లా కేంద్రంలో స్థల లభ్యతను బట్టి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


నర్సరీల్లో మొక్కలు రెడీ..

ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే తులసి, గోరింటాకు, గులాబీ, గన్నేరు, మునగ మొక్కలను ఇళ్లలో నాటుకునేందుకు పంపిణీ చేస్తున్నాము.  నర్సరీల నుంచి ప్రజలు మొక్కలు తీసుకెళ్లి నాటుకుంటున్నారు. అధికారికంగా ఈనెల 25 నుంచి హరితహారం ప్రారంభించనున్నాం. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామపంచాయతీల్లో పంచాయతీకి ఒకటిచొప్పున నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నాం. గత ఏడాదికి సంబంధించి 23లక్షల వరకు నర్సరీల్లో మొక్కలు మిగిలి ఉండగా.. కొత్తగా 34.31 లక్షల మొక్కలను పెంచాం. శాఖలవారీగా ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. 5లక్షల వరకు గుంతలు తవ్వారు. 2.50 లక్షలకు పైచిలుకు మొక్కలు నర్సరీల నుంచి తీసుకెళ్లారు. 

- నీరజ, రంగారెడ్డి జిల్లా ఉపాధిహామీ అధికారి


Read more