గ్రేటర్‌లో ప్రచార హోరు

ABN , First Publish Date - 2020-11-27T04:29:31+05:30 IST

వికారాబాద్‌ జిల్లా నేతలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

గ్రేటర్‌లో ప్రచార హోరు

  • వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నేతలకు డివిజన్ల బాధ్యతలు
  • అభ్యర్థి గెలుపు కోసం జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రచారం
  • కాంగ్రెస్‌, బీజేపీ జిల్లా నేతలకూ డివిజన్ల ప్రచార బాధ్యతలు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లా నేతలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వారంరోజులుగా తమకు ప్రచార బాధ్యతలు అప్పగించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌ నేతలు విశ్వప్రయత్నం చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు కూడా ప్రచారంలో వేగం పెంచాయి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఒక్కో డివిజన్‌కు ఒక్కొక్కరికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. దీంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హఫీజ్‌పేట డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలను జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌లకు బాధ్యతలు అప్పగించగా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డికి అప్పగించారు. గుడిమల్కాపూర్‌ డివిజన్‌) ఇన్‌చార్జి బాధ్యతలను వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌  మెతుకు ఆనంద్‌ కు అప్పగించగా, మన్సూరాబాద్‌ డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డికి అప్పగించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి అప్పగించగా, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి అత్తాపూర్‌ డివిజన్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు విజయనగర్‌ కాలనీ డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి వివేకానందనగర్‌ డివిజన్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌ పటేల్‌ గుడి మల్కాపూర్‌ డివిజన్‌లో ప్రచారం చేస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్ల పరిధిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆరు డివిజన్ల పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు యు.రమేష్‌కుమార్‌, పాండుగౌడ్‌, లాహోటీ, పోకల సతీష్‌ ప్రచారం చేస్తుండగా,  పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోకట్‌ మాధవరెడ్డి శుక్రవారం నుంచి జుబ్లీహిల్స్‌ డివిజన్‌లో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తీగల సదానందరెడ్డి శుక్రవారం నుంచి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడే ప్రచారంలో పాల్గొంటున్నారు. రోజూ పాదయాత్రలు చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


మేడ్చల్‌ జిల్లా ప్రజాప్రతినిధుల ప్రచారం

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) :  మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా నేతలు కూడా గ్రేటర్‌ ఎన్నిక ప్రచారంలో నిమగ్నమయ్యారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150డివిజన్లు ఉండగా.. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 46డివిజన్ల వరకు ఉన్నాయి. దీంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఐదు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ముఖ్యనేతలంతా కూడా అధిష్ఠానం నిర్ణయించిన డివిజన్లలో నిత్యం ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో 4 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి చామకూర మల్లారెడ్డి కుత్బుల్లాపూర్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఉప్పల్‌ నియోజకవర్గంలో, టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు బాధ్యతలను అప్పగించారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారం చేస్తుండగా, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ కుత్బుల్లాపూర్‌లో, పీసీసీ ఓబీసీ సెల్‌ వైస్‌చైర్మన్‌ తోటకూర వజ్రేష్‌యాదవ్‌ ఉప్పల్‌ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం  చేసేందుకుగానూ కోఆర్డినేట్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో జాయుంట్‌ కో-ఆర్డినేటర్‌గా మేడ్చల్‌జిల్లా రూరల్‌ కమిటీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రంరెడ్డిని నియమించారు. అర్బన్‌ కమిటీ అధ్యక్షుడు పన్నాల హరీష్‌రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని ముఖ్యనేతలంతా కూడా అన్ని డివిజన్లలోనూ అభ్యర్థుల తరపున ఓట్ల కోసం జనాల్లో తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. 

Updated Date - 2020-11-27T04:29:31+05:30 IST