అన్నీ బంద్‌

ABN , First Publish Date - 2020-03-15T05:46:42+05:30 IST

ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా కరోనా వైరస్‌ పేరే వినిపిస్తుంది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తుంది. వైరస్‌ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియని

అన్నీ బంద్‌

 కరోనాపై ప్రభుత్వం హైఅలర్ట్‌

నేటి నుంచి నెలాఖరు వరకు విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్‌, సినిమా హాల్స్‌ మూసివేత

షెడ్యూల్‌ ప్రకారమే.. ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు : డీఈఓ విజయలక్ష్మి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా కరోనా వైరస్‌ పేరే వినిపిస్తుంది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తుంది. వైరస్‌ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటీవ్‌గా తేలాయి. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలు పొందుతున్నారు. కరోనా వైర్‌సతో కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందటం కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వ స్తున్న వారిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్దనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమాన ప్రయాణికుల్లో ఎవరైనా కరోనా లక్షణాలు కనిపిస్తే..


వెంటనే అక్కడ నుంచి వికారాబాద్‌ జిల్లా అనంతగిరికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ 36 గదులను సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అక్కడ నుంచి గాంధీ అసుపత్రికి తరలిస్తున్నారు. కరోనా బాధిత కేసులు రోజు రోజుకు పెరుగుతండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై.. కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు సినిమా హాల్స్‌, షా పింగ్‌ మాల్స్‌ మూసివేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి నెలాఖరు వరకు అన్నీ బంద్‌ కానున్నాయి.


అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికపుడు అధ్యాయనం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాలన్నింటిపై చర్చించి నిర్ణయించేందుకు  సీఎం కేసీఆర్‌ శనివారం రాత్రి కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. 


షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు..

ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారమే వీటిని కొనసాగించాలని సర్కార్‌ నిర్ణయించింది.  అలాగే పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలిపింది. 


ఎక్కడ చూసినా కరోన భయం..

రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైర్‌సతో ప్రజలు భయాంతోళనకు గురవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నా రు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపుతోంది. జనం లేక కొన్ని చోట్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా  మారా యి. గిరాకీ లేక వ్యాపారాలు నష్టాల బాట పడుతున్నా యి. ఇప్పటికే పౌలీ్ట్ర రంగం కుప్పకూలింది. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆదాయం పడిపోయింది. వైరస్‌ బూచితో సినిమా హాళ్లు వెలవెలబోతున్నాయి. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలో ఇప్పటికే సెలవులు ప్రకటించి వర్క్‌ ఫ్రమ్‌ హోం నిర్వహిస్తున్నారు. 


పెళ్లికి 200 మందిలోపు హాజరుకావాలి..

జనసామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యుల మధ్యనే చేసుకోవాలి. 200 మందిలోపు హాజరయ్యేలా చూసుకోవాలి. ఈనెలాఖరు వరకు మ్యారేజ్‌ హాల్స్‌ బుకింగ్‌ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


యధావిధిగా ‘పది’ పరీక్షలు

పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం పూర్తయింది. ఈ నెల 16న హాల్‌టికెట్లు అందజేయాలని హెచ్‌ఎంలకు తెలియజేశాం. 19 నుంచి పరీక్షలు ఉన్నాయి. ఇంటి వద్ద ఉండి చదువుకోవాలి. కరోనా వైరస్‌ సోకకుండా ఇప్పటికే సర్కూలర్‌ జారీ చేశాము. ప్రతి పాఠశాలలో ప్రార్థన సమయంలో కరోనా గురించి అవగాహన  కల్పిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సమయంలో మాస్క్‌లు ఇవ్వాల్సిన విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. 

 విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి 


ప్రభుత్వ నిర్ణయం సరైనదే..

కరోన వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మంచిదే. అయితే ఇప్పటికే సినిమా థియేటర్స్‌లు చాలా వరకు నష్టల్లో నడుస్తున్నాయి. కాగా ప్రభుత్వం ఈ నెల 31 వరకు సినిమా థియేటర్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం కొంత ఇబ్బంది కల్గిస్తుంది. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. 

దామోదర్‌ యాదవ్‌, వెంకటేశ్వర సినిమా థియేటర్‌, యజమాని, చేవెళ్ల


అప్రమత్తంగా ఉండాలి

కరోన వైరస్‌ ప్రభావంతో షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  మంచిదే. కిరాణా షాపులు మూసివేయాలని అదేశాలు అందలేదు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

కుంచం శ్రీనివాస్‌గుప్తా, కిరాణ షాపు యాజమాని, చేవెళ్ల 

Updated Date - 2020-03-15T05:46:42+05:30 IST