గొర్రెలేవి..?.. మొదటి విడతలో 366 మందికే అందజేత

ABN , First Publish Date - 2020-12-11T04:50:36+05:30 IST

గొర్రెలేవి..?.. మొదటి విడతలో 366 మందికే అందజేత

గొర్రెలేవి..?.. మొదటి విడతలో 366 మందికే అందజేత

  • పత్తాలేని రెండో విడత గొర్రెల పంపిణీ 
  • పథకం ఊసెత్తని ప్రభుత్వం  
  • డీడీలు చెల్లించి  రెండేళ్లు.. ఆందోళనలో లబ్ధిదారులు

ఇబ్రహీంపట్నం రూరల్‌ : గొర్రెల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడెప్పుడా అని  ఇబ్రహీంపట్నం మండలంలో గొర్ల కాపరులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని కొనసాగిస్తారా... లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల వృత్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో దోహద పడుతుందని నాడు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ సార్వత్రిక ఎన్నికల తరువాత పథకం అమలులో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గొర్ల కాపరులు మండిపడుతున్నారు. మెదటి విడత గొర్రెలు అందజేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రెండో విడత పంపిణీపై ఊసెత్తకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 


366 మంది లబ్ధిదారులకే పంపిణీ


2017లో ప్రభుత్వం మండలాల వారీగా గొల్లకుర్మల సొసైటీలనుఏర్పాటు చేసింది. లాటరీ పద్ధతిన సొసైటీ సభ్యుల్లో సగం మందికి మొదటి విడతగా మిగిలిన సభ్యులకు రెండో విడతగా గొర్రెలను అందజేస్తామని ప్రభుత్వం సృష్టం చేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 2,786 మంది సభ్యులకు గాను లాటరీ పద్ధతిలో 1,393 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. అందులో కేవలం 366 మందికే గొర్రెలను పంపిణి చేసింది. యూనిట్ల వారీగా చూస్తే.. కొంగరకలాన్‌లో 51 యూనిట్లు, కప్పాడ్‌లో 24, తులేకలాన్‌లో 31, చెర్లపటెల్‌గూడలో 14, ఎలిమినేడులో 26, రాయపోలులో 34, మన్నేగూడ, పొల్కంపల్లిలో 35, ముకునూరు 01, నాగన్‌పల్లిలో 34, దండుమైలారంలో 25, నెర్రపల్లిలో 35, పోచారంలో 27, ఉప్పరిగూడలో 08, రాందాసుపల్లిలో 21, యూనిట్లను పంపిణీ చేశారు. ఎంపీ పటేల్‌గూడ, ఆదిభట్ల గ్రామాల్లో ఒక్క యూనిట్‌ కూడా పంపిణీ చేయలేదు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభించినా నేటికీ ఇవ్వకపోవడంతో గొల్లకుర్మలు ఆవేదన చెందుతున్నారు. 


వరుస ఎన్నికలతో బ్రేక్‌


 2018 జులైలో రెండో విడత గొర్రెల పంపిణీకి బ్రేక్‌ పడింది. వరుసగా అసెంబ్లీ, పంచాయితీ, లోక్‌సభ, మండల పరిషత్‌, ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమలు కారణంగా గొర్రెల పంపిణీ ముందుకు సాగలేదు. రెండో విడత గొర్రెల కోసం ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్‌ గ్రామం లో 40 మంది, దండుమైలారం గ్రామంలో 11 మందితో పాటు పలు గ్రామాల్లో వందల మంది లబ్దిదారులు తమ వాటా డీడీలు చెల్లించారు. కాగా, గొర్రెలు వస్తయో.. రావో తెలియక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


గొర్రెల పంపిణీ ప్రక్రియ ఇలా...


లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌ కింద 20 గొర్రెలుతో పాటు ఒక గొర్రె పొట్టేలును అందజేస్తారు. యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుంది. అందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగిలిన 25 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. దీని కోసం గ్రామాల వారీగా గొల్లకుర్మల సొసైటీలను ఏర్పాటు చేశారు.పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో లాటరీ తీసీ ఏ, బీ జాబితాలుగా చేశారు. ఏ జాబితా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా, బీ జాబితా వారికి నిరాశే మిగిలింది.

Updated Date - 2020-12-11T04:50:36+05:30 IST