భలే గిరాకీ..
ABN , First Publish Date - 2020-12-12T04:55:46+05:30 IST
తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి చేస్తున్న కార్తాగోల్డ్ కుసుమ నూనెకు ఓపెన్ మార్కెట్‌లో భలే డిమాండ్ పెరిగింది.
- తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ‘కార్తా గోల్డ్’ ఉత్పత్తి
- కుసుమ నూనె ఉత్పత్తులు పెంచి అమెజాన్‌తో ఒప్పందానికి కసర త్తు
- లీటరు నూనెకు రూ. 400
- ఇప్పటి వరకూ రూ.10 లక్షల విలువైన నూనె విక్రయం
తాండూరు : తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి చేస్తున్న కార్తాగోల్డ్ కుసుమ నూనెకు ఓపెన్ మార్కెట్‌లో భలే డిమాండ్ పెరిగింది. నూనె ధర ఎక్కువగా ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ప్రజలు ఈ నూనె కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. 2019 నవంబర్‌లో కుసుమ నూనెను కార్తా గోల్డ్‌గా నామకరణం చేసి ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందారు. కుసుమ నూనెలో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు ఉండటంతో ఇప్పటి వరకు రూ.10లక్షల విలువ చేసే 2500 లీటర్ల కుసుమ నూనెను విక్రయించారు. ముఖ్యంగా ఈ నూనెను అన్ని వంటకాలతోపాటు హెయిర్ ఆయిల్‌గా కూడా వాడవచ్చని, వివిధ పొడుల్లో పచ్చినూనె వేసుకోవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి తెలిపారు. నాణ్యమైన ఈ నూనె ఉత్పత్తులు మరిన్ని పెంచి అమెజాన్ వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వర్షాల వల్ల వివిధ పంటలు నష్టం వాటిల్లితే అధిక శాతం రైతులు ఈ ప్రాంతంలో కుసుమ సాగు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా అత్యధికంగా పండించే కుసుమను కొనుగోలు చేసి తాండూరు పరిశోధన కేంద్రంలో నాణ్యమైన కుసుమ నూనె తయారు చేస్తూ ఉత్పత్తులను పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కుసుమ నూనె లీటరుకు రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు.